
ఉత్సవ ఏర్పాట్లు, పనుల ఆకస్మిక తనిఖీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దుర్గగుడిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, దసరా ఉత్సవాల ఏర్పాట్లను శనివారం దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఉదయం మహా మండపం ఎదుట నిర్మాణంలో ఉన్న అన్నదాన భవనం, మల్లేశ్వరాలయం నుంచి కొండ దిగువకు జరుగుతున్న ర్యాంప్, మెట్ల నిర్మాణంతో పాటు ప్రసాదాల పోటు భవనాల పనులను ఆయన పరిశీలించారు. దసరా ఉత్సవాలకు ముందుగానే ఆయా భవనాల్లో అన్ని పనులు పూర్తి కావాలని, అదే సమయంలో పనుల్లో ఎక్కడా నాణ్యత లోపం లేకుండా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం కనకదుర్గనగర్, రథం సెంటర్‌లో జరుగుతున్న దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
నూతన అన్నదానం, ప్రసాదాల పోటులో పూజలు
మహా మండపం ఎదుట నూతనంగా నిర్మించిన అన్నదానం, ప్రసాదాల పోటులో శనివారం కమిషనర్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ సారథ్యంలో అర్చకులు అమ్మవారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం నూతన భవనాల్లో పాలు పొంగించారు. దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు నిరంతరం ప్రసాదాలను అందించేందుకు ఈ రెండు భవనాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఉత్సవాల్లో భక్తులకు అల్పాహారం, అన్న ప్రసాదం, ఉచిత లడ్డూలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో శీనానాయక్, ఏసీ రంగారావు, ఈఈలు కోటేశ్వరరావు, రాంబాబు, ఏఈవోలు ఎన్.రమేష్‌బాబు, వెంకటరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.