
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమ కేసులో అరెస్టయిన రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఇవాళ(ఆదివారం) జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, వారి విడుదలపై జైలు అధికారులు తాత్సారం చేశారు. ముగ్గురి విడుదల ప్రక్రియను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నిన్న(శనివారం) సాయంత్రమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇవాళ(ఆదివారం) వారిని ఆలస్యంగా విడుదల చేశారు. ఈ క్రమంలో విజయవాడ జైలు సూపరిటెండెంట్ తీరుపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెయిల్ వచ్చిన మమ్మల్ని జైల్లో బంధించారని ధనుంజయరెడ్డి మండిపడ్డారు. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని.. మళ్లీ ఏదో కేసు పెట్టి జైల్లో బంధించాలని చూశారంటూ ధనుంజయరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అక్రమ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాగించిన ప్రయత్నాలను పటాపంచాలు చేసింది. ఈ ముగ్గురికీ బెయిల్ ఇచ్చింది. చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వీరికి ఏసీబీ కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది.
పాస్‌పోర్టులను ఇప్పటికే జప్తు చేయకుంటే, విడుదలైన మూడు రోజుల్లో వాటిని స్వాధీనం చేయాలని ఆదేశించింది. ముగ్గురూ రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లొద్దని, తమ నియంత్రణలోని లేని పరిస్థితుల్లో తప్ప మిగిలిన అన్నివేళల్లో కోర్టు విచారణలకు హాజరై తీరాలని స్పష్టం చేసింది.

తదుపరి పర్యవేక్షణ నిమిత్తం మొబైల్ ఫోన్‌ను యాక్టివ్‌లో ఉంచాలని పేర్కొంది. సాక్షులను గాని, సహ నిందితులను కలవడానికి వీల్లేదని ఆదేశించింది. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని, షరతులను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దవుతుందని వెల్లడించింది. ఈ మేరకు న్యాయాధికారి పి.భాస్కరరావు శనివారం తీర్పు వెలువరించారు.