
సాక్షి, విజయవాడ: రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు విడుదలపై జైలు అధికారులు తాత్సారం చేస్తున్నారు. ముగ్గురి విడుదల ప్రక్రియను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు. నిన్న సాయంత్రమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో విజయవాడ జైలు సూపరిటెండెంట్ తీరుపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయవాదులు జైలు ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
ఈ సందర్బంగా అడ్వకేట్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ..‘నిన్న సాయంత్రం ఆర్డర్స్ వచ్చినా జైలు అధికారులు.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలను విడుదల చేయలేదు. నిన్న రాత్రి 8:30 వరకూ జైలు వద్ద ఎదురు చూశాం. ఈరోజు ఉదయం 6:30 గంటలకు విడుదల చేస్తామని జైలు సూపరింటెండెంట్ చెప్పారు. ఉదయం ఆరు గంటలకే జైలు వద్దకు న్యాయవాదులు చేరుకున్నారు. కానీ, ఇప్పటి వరకూ జైలు సూపరింటెండెంట్ అందుబాటులో లేరు. ఆయన ఎక్కడని మేము ప్రశ్నిస్తే.. జైలు అధికారులు వింత సమాధానం చెబుతున్నారు. అదే పనిగా మేము ప్రశ్నించడంతో మచిలీపట్నం నుంచి సూపరింటెండెంట్ బస్సులో వస్తున్నారంటున్న జైలు అధికారులు మాట్లాడుతున్నారు. ఇది ఇల్లీగల్ కన్‌ఫైన్మెంట్ కిందకు వస్తుంది. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాం’ అని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. మద్యం అక్రమ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాగించిన ప్రయత్నాలను పటాపంచాలు చేసింది. ఈ ముగ్గురికీ బెయిల్ ఇచ్చింది. ఛార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వీరికి ఏసీబీ కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది.
పాస్‌పోర్టులను ఇప్పటికే జప్తు చేయకుంటే, విడుదలైన మూడు రోజుల్లో వాటిని స్వాధీనం చేయాలని ఆదేశించింది. ముగ్గురూ రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లొద్దని, తమ నియంత్రణలోని లేని పరిస్థితుల్లో తప్ప మిగిలిన అన్నివేళల్లో కోర్టు విచారణలకు హాజరై తీరాలని స్పష్టం చేసింది. తదుపరి పర్యవేక్షణ నిమిత్తం మొబైల్ ఫోన్‌ను యాక్టివ్‌లో ఉంచాలని పేర్కొంది. సాక్షులను గాని, సహ నిందితులను కలవడానికి వీల్లేదని ఆదేశించింది. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని, షరతులను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దవుతుందని వెల్లడించింది. ఈ మేరకు న్యాయాధికారి పి.భాస్కరరావు శనివారం తీర్పు వెలువరించారు.