
సాక్షి, కృష్ణా జిల్లా: పెనమలూరు మండలం పోరంకిలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అరాచకానికి దిగారు. వృద్ధ దంపతుల స్థలంపై ఎమ్మెల్యే కన్నేశారు. వృద్ద దంపతులకు నాదెళ్ల భానుతో కొంతకాలం సరిహద్దు వివాదం సాగుతోంది. సంబంధం లేకపోయినా స్థల వివాదంలో ఎమ్మెల్యే తలదూర్చారు. బోడె ప్రసాద్ తీరుపై వృద్ధ దంపతులు మండిపడుతున్నారు. పోలీసుల అండతో ఎమ్మెల్యే అనుచరులు.. అక్రమంగా గోడకట్టించారు. 10 రోజుల క్రితం స్థలంలో ఎమ్మెల్యే అనుచరులు మొక్కలు నాటారు.
‘‘పోరంకిలో మేం ఎన్నో ఏళ్ల నుంచి నివాసముంటున్నాం. నాదెళ్ల భాను అనే వ్యక్తికి, తమకు సరిహద్దు వివాదాలున్నాయి.. కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు మా స్థలంతో ఎలాంటి సంబంధం లేదు. అన్యాయంగా మా స్థలంలోకి ఎమ్మెల్యే మనుషులు చొరబడ్డారు. పది రోజుల క్రితం మా స్థలంలో ఎమ్మెల్యే పూలమొక్కలు పెట్టించారు. నిన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరులు మా స్థలంలో గోడ కట్టారు’’ అంటూ ఆ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘పోలీసులే దగ్గరుండి మరీ గోడ కట్టించారు. గోడ ఎలా కడతారని ప్రశ్నించినందుకు బోడే ప్రసాద్ మనుషులు నా భర్త పై దాడి చేశారు. వృద్ధుడని కూడా చూడకుండా లాగి పడేశారు. మాకు న్యాయం చేయాలి’’ అంటూ బాధితురాలు వేడుకుంటున్నారు.