బోడె ప్రసాద్‌@కబ్జాల..కాలకేయ!  

Bode prasad And His Followers Together Corrupted Thousands oF Crores For Four Years - Sakshi

సాక్షి,అమరావతి : అధికారం అండతో అందినకాడికి దండుకున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగింది. ఇసుక రేవుల నుంచి చెరువుల్లో మట్టిదాకా ప్రతి చోట అవినీతే.  ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అతని అనుచరులు సాగించిన అక్రమాలు, అరాచకాలు, భూకబ్జాలు,దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు.

అభివృద్ధి పనులను తూతూ మంత్రంగా చేపట్టి రూ.కోట్ల ప్రభుత్వ ఖజానాకు గండిపెట్టినా అడిగే నాథుడే లేదు. ప్రతి పనికి పర్సంటేజి విధించి కమీషన్ల దందాకు తెరలేపారు.. బోడె, అతని అనుచరులు కలిసి నాలుగున్నరేళ్లుగా రూ.వేల కోట్లు దోచుకున్నారంటే అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

దొంగ పరీక్ష రాయించిన మేధావి..
ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే విదేశీ పర్యటనకు వెళ్లి డిగ్రీ అర్హత కోసం దూరవిద్యలో పరీక్షకు తాను హాజరు కాకుండా మరో యువకుడితో రాయించిన ఘనత బోడె ప్రసాద్‌ది. వాస్తవానికి ఎమ్మెల్యే పదో తరగతి పాసై పాలిటెక్నిక్‌ డిస్కంటిన్యూ అయ్యారు. బీటెక్‌ బిల్డప్‌ను జనాల్లో ఇచ్చారు. అయితే తన విద్యార్హతను పెంచుకునే విషయంలో పరీక్ష రాసే సత్తా లేక దూరవిద్యలో డిగ్రీ చేయాలని సన్నిహిత వర్గాల ద్వారా కసరత్తు చేశారు.

ఇందులో భాగంగా అతను విదేశాల్లో ఉన్నా పోరంకిలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో దొంగ పరీక్ష రాయించేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కళాశాలకు వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే స్థానంలో పరీక్ష రాసేందుకు వచ్చిన యువకుడు పరారయ్యాడు. అయితే పరీక్షకు హాల్‌ టిక్కెట్‌ జారీ, పరీక్షకు హాజరైనట్లు సంతకం కూడా ఉంది. అయితే ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించినా జరిగిన వాస్తవాలను చూసిన ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. 

ఉచిత ఇసుక..కాసుల వేట..
అనేక ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టింది. తొలుత చోడవరంలో ఇసుక తవ్వకాలు చేపట్టారు. కూలీలతోనే లోడింగ్‌ చేయించాలనే నిబంధన ఉన్నా, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలను ఉల్లంఘిస్తూ నదీగర్భంలో పొక్లెయిన్‌లతో ఇసుక తోడి ప్రైవేటు ర్యాంపుల గుండా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు లారీలు, ట్రాక్టర్లలో ఇసుక రవాణా సాగించారు.

వేరే వ్యక్తులు క్వారీలోకి వెళ్లి ఉచిత ఇసుకను తీసుకునే అవకాశం లేకుండా అధికార పార్టీ గుత్తాధిపత్యంగా ఇసుక క్వారీలను తమ ఆధీనంలో ఉంచుకుంది. నిత్యం వెయ్యి నుంచి 1600 వరకూ ట్రాక్టర్లలో ఇసుక రవాణా సాగించినట్లు అంచనా. తద్వారా ఎమ్మెల్యే బోడె వర్గం రూ.కోట్లు అక్రమార్జన చేసినట్లు సమాచారం.

‘వసూల్‌ రాజా’
స్వయంగా ఆయనే ఒక బిల్డర్‌ అయి ఉండి, బిల్డర్లకు ఉన్న బాధలు మరిచి ఎమ్మెల్యేగా తనకు ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలోని బిల్డర్ల నుంచి రూ.3 కోట్లు అక్రమంగా వసూలు చేశారు. గ్రూప్‌ హౌస్‌ల నిర్మాణాలు లక్ష్యంగా వసూలు దందా నడిపారు. ఒక్కో ఫ్లాట్‌కి రూ.40 వేలు నుంచి రూ.60 వేలు వసూలు చేశారు.

ఓ బిల్డర్‌ వద్ద ఏకంగా ముక్కుపిండి మరీ రూ.80 లక్షలు వసూలు చేశారు. అభివృద్ధి తన లక్ష్యమని ప్రజల్ని నమ్మిస్తూ వసూలు చేసిన డబ్బుతో గ్రామంలో అభివృద్ధి చేపడతామని ఈ దందా నడిపారు. కృష్ణానదిలో ఇసుక, బుసక తెచ్చి రహదారులు నిర్మించి ఎంతో గొప్పగా తానే అభివృద్ధి చేశానని మభ్యపెట్టారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు సీఆర్‌డీఏ, పంచాయతీలు, ఇతర శాఖల నిధులు నుంచి రోడ్లు, డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి పనులు జరగాల్సి ఉండగా నిధులు సమీకరించటంలో వైఫల్యం చెందారు.

వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు  బిల్డర్‌ల నుంచి వసూలు చేశానని, తాను సచ్చీలుడనని అభివృద్ధికే తాను డబ్బు వసూలు చేశానని సభలు, సమావేశాలు, బహిరంగ సభల్లో గొప్పగా చెప్పుకోవటం, ప్రజల్ని నమ్మించే యత్నం చేయటం ఈయనకే చెల్లింది.

ఇసుక రవాణాలో కమీషన్ల  దందా
టీడీపీ నేతలు ఇసుకను ప్రధాన ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఇసుకను తవ్వేసి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఉచిత ఇసుక విధానం అర్థమే మార్చేశారు. అడ్డగోలుగా ఇసుక తవ్వేసి కోట్లు గడించారు. దీనిలో కీలక సూత్రధారి అధికార పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌. ఆయన అండ చూసుకుని అతని ముఖ్య అనుచరులు. ఇది బహిరంగ రహస్యమే.

అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుక అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పెనమలూరు మండలం పెద పులిపాక కేంద్రంగా ఉన్న క్వారీలో అమ్మకాలు చేపట్టారు. నిత్యం 400 నుంచి 600 ట్రాక్టర్లు, లారీల్లో ఇక్కడి నుంచి రవాణా సాగించేవి. క్వారీలో లోడింగ్‌ పనులను మాత్రం ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ తన బినామీల పేరుతో పొక్లెయిన్‌లను ఏర్పాటు చేయించారనే విమర్శ ఉంది.

నిత్యం ఈ క్వారీలో వాహనాల క్యూ ఉండగానే దొడ్డిదారిన 50కు పైగా ట్రాక్టర్లు, లారీలు ఇసుక లోడింగ్‌ చేయించటం, అధిక ధరకు అమ్ముకునేవారు. తెలంగాణ, గోదావరి జిల్లాలకు సైతం ఇక్కడి నుంచి ఇసుకను రవాణా సాగించారు. లారీ ఇసుక రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకూ అప్పట్లో ధర పలికింది. సుమారు ఏడాదిన్నర పాటు యథేచ్ఛగా ఇసుక అక్రమ లోడింగ్, రవాణా ఇక్కడి నుంచి సాగింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఇసుక అక్రమ వ్యాపారంపై కోర్టుకు వెళ్లారు. దీంతో ఇసుక రవాణా ఆగింది. 

అక్రమాలకు  అండ..
యనమలకుదురు, పెద పులిపాక గ్రామ పంచాయతీల్లో జరిగిన భారీ కుంభకోణాలకు సంబంధించి చర్యలు తీసుకోకుండా బోడె అడ్డుగా నిలిచారనే ఆరోపణలు ఉన్నాయి. యనమలకుదురులో అక్రమ భవన నిర్మాణ ప్లాన్‌లు, పారిశుద్ధ్య పనులకు అక్రమంగా సామగ్రి కొనుగోళ్లు ఇలా ఈ పంచాయతీలో రూ.కోటికి పైగా అక్రమాలు జరిగాయి.

పెదపులిపాకలో రూ.70 లక్షలు నిధులు దుర్వినియోగం జరిగినా ఇప్పటి వరకూ ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకుండా అటకెక్కించేశారు. యనమలకుదురు గ్రామంలో సుమారు 700 దొంగ ప్లాన్‌ జారీకి రూ.2 కోట్లు చేతులు మారాయి. దీనిపై విజిలెన్స్‌ విచారణ జరిగినా వాస్తవాలు మాత్రం వెలుగులోకి రాలేదు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top