
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
వత్సవాయి: వేర్వేరుగా జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిన ఎస్‌కే దస్తగిరి (24) అదే మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఒకరు అనారోగ్యంగా ఉన్నట్టు ఫోన్ రావడంతో గౌరవరం నుంచి అనుమంచిపల్లి వెళ్లే క్రమంలో రహదారి పక్కన నిలిపిఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో దస్తగిరి అక్కడికక్కడే మృతిచెందాడు. దస్తగిరికి అవివాహితుడు. తల్లి జాన్‌బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చిల్లకల్లు – వైరా రహదారిలో పెద్ద కాలువ వద్ద జరిగిన మరో ప్రమాదంలో మక్కపేట గ్రామానికి చెందిన చింతల వెంకటేశ్వరరావు(25) మరణించాడు. వెంకటేశ్వరరావు తన ద్విచక్ర వాహనంపై శుక్రవారం మక్కపేట నుంచి చిల్లకల్లు వెళ్తుండగా పెద్ద కాలువ సమీపంలో ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో వెంకటేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించి చికిత్స చేస్తుండగా శనివారం మృతిచెందాడు. మృతునికి భార్య, ఏడాది వయస్సున్న కుమార్తె ఉన్నారు. మృతుని భార్య భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం