ముగ్గురు స్నేహితులను కాపాడి! చివరికి.. | Tragedy In Louisiana USA NRI Anuroop Reddy Passes Away | Sakshi
Sakshi News home page

ముగ్గురు స్నేహితులను కాపాడి! చివరికి..

Jun 1 2026 11:03 AM | Updated on Jun 1 2026 7:43 PM

Tragedy In Louisiana USA NRI Anuroop Reddy Passes Away

అబ్దుల్లాపూర్‌మెట్‌: అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితులను కాపాడిన అనురూప్‌రెడ్డి.. నీట మునిగి మృతి చెందాడు.

మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కోడూరి రాజేందర్‌రెడ్డి–దుర్గాభవాని దంపతులు కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కవాడిపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆశ్రిత్‌రెడ్డితోపాటు అనురూప్‌రెడ్డి (22) సైతం ఐదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. అనురూప్‌రెడ్డి యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇటీవల మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేశాడు.

శనివారం లూసియానాలోని టోరోడో పార్క్‌లో ఉన్న సెబాన్‌ రివర్‌లో సరదాగా స్నేహితులతో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో అతనితోపాటు మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. హఠాత్తుగా ముగ్గురూ లోతు ప్రదేశంలోకి వెళుతూ రక్షించండి అంటూ కేకలు వేశారు. అనురూప్‌రెడ్డి ఒక్కొక్కరిని పైకి లాగుతూ ఒడ్డుకు చేర్చారు. తను పైకి వచ్చే క్రమంలో చెరువులో ఉన్న ఫిషింగ్‌ వైర్‌ కాలికి చుట్టుకోవడంతోపాటు నీటి ప్రవాహం పెరగడంతో పైకి రాలేకపోయాడు. అక్కడున్న వారు రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే నీటిని ఎక్కువగా మింగడంతో మృత్యువాత పడ్డాడు.

ఉన్నత చదువుల కోసం వెళ్లిన కుమారుడు ఇలా విగతజీవిగా మారుతాడని అనుకోలేదని కుటుంబ సభ్యులు దు:ఖసాగరంలో మునిగారు. అనురూప్‌రెడ్డికి ఫొటోగ్రఫీ ఎంతో ఇష్టమని, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని అతని సోదరుడు తెలిపారు. టీం ఎయిడ్‌ స్వచ్ఛంద సంస్థ, ఇండియన్‌ ఎంబసీ, లూసియానా కాన్సులేట్‌ సంయుక్త సహకారం అందించి వారం రోజుల్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement