వేటూరి గీతాల వెల్లువ.. డాలస్‌లో సాహితీ మహోత్సవం! | NRI Special Story: Veturi Sahiti Mahotsavam In Dallas | Sakshi
Sakshi News home page

వేటూరి గీతాల వెల్లువ.. డాలస్‌లో సాహితీ మహోత్సవం!

Aug 21 2026 10:23 AM | Updated on Aug 21 2026 1:21 PM

NRI Special Story: Veturi Sahiti Mahotsavam In Dallas

డాలస్, టెక్సస్: ‘వేటూరి సాహిత్యాభిమానసమితి ఆఫ్ అమెరికా’, ‘శుభం ఫౌండేషన్’ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ప్రిస్కో మెమోరియల్ హైస్కూల్ ఆడిటోరియంలో ‘కవికులాలంకార’ వేటూరి సుందర రామమూర్తి విరచిత 8 సినీ, సినీయేతర గీత సంపుటాల ఆవిష్కరణ, వేటూరి ప్రత్యేక పాటల నృత్యం, సంగీత విభావరి 500 మందికి పైగా హాజరైన సంగీతం, సాహిత్యాభిమానుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.

ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగువేదకవి, ప్రముఖ సినీగీత రచయిత, దర్శకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ సాహిత్య సంపుటాలను ఆవిష్కరించి, తొలి గ్రంథాన్ని విశిష్ట అతిథిగా హాజరైన ఈనాడు దినపత్రిక సంపాదకుడు ఎం. నాగేశ్వరరావుకు, ఆ తర్వాత ప్రత్యేక అతిథులుగా హాజరైన వామరాజు సత్యమూర్తికి, డా. కొమాండూరి రామాచారికి అందజేశారు.

వేటూరి సాహిత్యాభిమానసమితి ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, శుభం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గోపాల్ పోణంగి ఆధ్వర్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమంలో ఈ సాహిత్య సంపుటాలను ప్రచురించడానికి సహాయ సహకారాలు అందించిన వారిలో హాజరైన డా. బుచ్చిబాబు పైడిపాటి, చంద్రహాస్ మద్దుకూరి, చంద్రశేఖర్ రెంటచింతల, గోకుల్ కిలారు, ప్రొఫెసర్ జగదీశ్వరన్ పుడూర్, మురళి వెన్నం, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, రామకృష్ణ పొక్కునూరి, రావు కల్వల, డా. సుబ్రహ్మణ్యం బోయారెడ్డి, విజయసారధి జీడిగుంట, వినోద్ ఉప్పులను ఘనంగా సత్కరించారు.

వేటూరితో సుదీర్ఘకాలం సాహిత్య ప్రయాణం చేసిన ప్రముఖ సినీగీత రచయిత, దర్శకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుతో డా. ప్రసాద్ తోటకూర నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమంలో పాత్రికేయుడిగా ఉన్న వేటూరి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు ఒత్తిడిమేరకు అయిష్టంగా రచయితగా సినీరంగ ప్రవేశం చేయడం, ఆ తర్వాత సినీ పరిశ్రమలో ఒక ముఖ్యభాగం అవడం, కవిపండితుడిగా వేటూరి కవితావైభవం, ఆయన కలం నుంచి అప్రయత్నంగా వేగంగా వెలువడే గీతాల వెల్లువ, ఆయన వ్యక్తిత్వం, అందరినీ గౌరవించే తత్వం ఆయనకున్న తెలుగు భాషాభిమానం గురించి మాట్లాడారు. అలాగే, పాత్రికేయుడిగా, సంపాదకుడిగా ఆయన రచనాశైలి, కేవలం వేలకొద్దీ సినిమా గీతాలేగాక ఎన్నో విలువైన వ్యాసాలు, ‘జీవనరాగం’, ‘రాబిన్ హుడ్’, ‘సిరికాకొలను చిన్నది’, ‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ లాంటి విశిష్ట రచనలు, వేటూరి జీవితంలో జరిగిన కొన్ని హాస్య సంఘటనలు ఇంకా వివిధ అంశాలపై వీరి మధ్య దాదాపు గంటసేపు సాగిన చర్చా కార్యక్రమం ఆద్యంతం నవ్వులు పూయించి మంచి ప్రేక్షకాదరణ పొందింది.

ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ  “వేటూరి రాసిన పాటలలో గొప్ప పాటలు ఏవి? అని చాట్‌ జీపీటీని అడిగితే - ఆయన రాసిన వేలాది పాటలలో కొన్ని గొప్ప పాటలను ఎంపిక చేయడం కష్టం అనే సమాధానం వచ్చింది. దాన్నిబట్టి వేటూరి ప్రతిభ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు” అన్నారు. 18 సంవత్సరాల పాటు పాత్రికేయుడిగా పనిచేసిన వేటూరిని ఈనాడు జర్నలిజం స్కూల్‌కు ఆహ్వానించి అక్కడి విద్యార్థులతో మాట్లాడించే అవకాశం కలిగిందని, ఆయన జ్ఞాపకశక్తి అమోఘమని, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఇంటర్వ్యూ చేసిన తొలి తెలుగు జర్నలిస్ట్ వేటూరి అని, ప్రేమ, విరహం, భక్తి, తాత్వికత, శృంగారం, వేదన, ప్రకృతి, సామాజిక చైతన్యం ఇలా ఏ రకపు పాటనైనా అక్షరాలలో ఆవిష్కరించగల దిట్ట అని, “రాలిపోయే పువ్వా, నీకు రాగాలెందుకే” అనే పాటకు జాతీయ పురస్కారం అందుకున్న వేటూరి సాహిత్యం జ్ఞానపీఠ పురస్కారానికి నూటికి నూరు శాతం అర్హనీయమైనదన్నారు. వేటూరి పాటలు తెలుగుభాష ఉన్నంతవరకు చిరస్థాయిగా ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతాయి అంటూ ఘన నివాళులర్పించారు.

ప్రత్యేక అతిథిగా హాజరైన వామరాజు సత్యమూర్తి మాట్లాడుతూ  “డా. ప్రసాద్ తోటకూర నిర్వహణలో గత జనవరిలో హైదరాబాద్‌లో భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా కన్నుల పండుగగా జరిగిన ఈ గ్రంథాల ఆవిష్కరణ సభలోనూ, మరలా ఇప్పుడు ఇక్కడ డాలస్‌లో అత్యంత వైభవంగా జరిగిన సభలోనూ పాల్గొనడం తన అదృష్టం” అన్నారు.

ఆత్మీయఅతిథిగా హాజరైన ప్రముఖ సంగీతగురు డా. కొమండూరి రామాచారి వేటూరితో తనకున్న అనుబంధాన్ని, ఆయన గీత రచనా శైలిని ప్రశంసిస్తూ, కొన్ని పల్లవులను మధురంగా గానం చేసి వేటూరికి స్వరనీరాజనాలర్పించారు.

ప్రముఖ గాయకుడు, సంగీతదర్శకుడు రాజశేఖర్ సూరిభొట్ల నిర్వహణలో సాగిన సంగీత విభావరిలో స్థానిక గాయనీ గాయకులు సంతోష్ ఖమ్మంఖర్, చంద్రహాస్ మద్దుకూరి, శిరీష కోటంరాజు, జానకి శంకర్, శ్రేయస్ సూరిభొట్ల, సాహితి కోటంరాజు పాడిన పాటలు అందరినీ అలరించాయి. రాజశేఖర్ కీబోర్డ్‌పై, ముద్దు పాయ్ కీబోర్డు, గిటార్‌పై, రాం యామిజాల, నీవ్ యామిజాల పెర్కషన్ వాయిద్యాలపై, సౌండ్ ఇంజనీర్‌గా రవి మాచ, రవి రావు భట్టిప్రోలు అందించిన సాంకేతిక సహకారం ఈ సంగీత విభావరికి మరింత శోభను చేకూర్చాయి.

వేటూరి రాసిన అసంఖ్యాక అద్భుత గీతాలలో ఒక పద్నాలుగు పాటలను ఈ సంగీత విభావరిలో గానం చేశారు. వాటిలో “ఓం నమః శివాయ” (సాగర సంగమం) అనే గీతానికి గురు పరంపర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ డైరెక్టర్ గురు మంజు హేమమాలిని చావ శిష్యులు దేవినేని వైడూర్య, సాహితి వేముల, సింధు వేముల, తేజశ్రీ అబ్బూరు అద్భుతంగా నృత్యం చేశారు.

“జగతి సిగలో జాబిలమ్మకు” (పరదేశి) గీతానికి రాగ మయూరి స్కూల్ ఆఫ్ డాన్స్ అండ్‌ యోగా గురు సింధుజ ఘట్టమనేని శిష్యులు గ్రీష్మా అశోక్, నందిత దినేష్, సహస్ర తటవర్తి, రుషిక కాళ్ల చేసిన నృత్యం కనువిందు చేసింది.

“నెమలికి నేర్పిన నడకలివి” (సప్తపది) అనే పాటకు నాట్యాంజలి కూచిపూడి డాన్స్ స్కూల్ గురు శ్రీలత సూరి శిష్యులు ప్రియాంక పొత్తూరి, శ్రుతి పొత్తూరి, స్వప్నిక వడాలి, అంజిత నాయర్ నృత్యం అందరినీ ఆకట్టుకుంది.

ఆ తర్వాత “మధుర మధురతర” (అర్జున్) అనే గీతానికి సాయి నృత్య అకాడమీ కూచిపూడి డాన్స్ స్కూల్ గురు శ్రీదేవి యడ్లపాటి శిష్యులు పల్లవి తూములూరు, సంజన కల్వకొలను నృత్యం అందరినీ అలరించింది.

ఈ కార్యక్రమంలో ప్రత్యేకఅతిథులుగా హాజరైన టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబర్ మాట్ షాహీన్, ఫ్రిస్కో నగర మేయర్ మార్క్ హిల్, కౌన్సిల్ మెంబర్ యాన్ యాన్దర్సన్‌ను గోపాల్ పోణంగి, డా. ప్రసాద్ తోటకూర ఘనంగా సన్మానించారు. ఇదే కార్యక్రమంలో ఇటీవల కొలంబియా దేశంలో 8 సంవత్సరాల వయస్సులోపు పిల్లల కోసం జరిగిన చదరంగం పోటీలలో అమెరికా నుంచి పాల్గొని, పాన్ అమెరికన్ చాంపియన్‌గా నిలిచి బంగారు పతకం సాధించిన సరయు తలపనేనిని టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబర్ మాట్ షాహీన్ ఘనంగా సత్కరించి సరయు తల్లిదండ్రులు సందీప్, శ్రీలక్ష్మిని అభినందించారు.

ఈ కార్యక్రమాన్ని మొత్తం ఎంసీలుగా అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించిన అనీషా పోణంగి, అభినుత మద్దుకూరికి, కార్యక్రమ విజయానికి తోడ్పడిన శుభం ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులకు, కార్యకర్తలు కిశోర్ నారె, పావని నున్న, నాగరాజు నలజల, నేలకొండ రాజు, పద్మ ముప్పిడి, శాస్త్రి అనిపిండి, వివిధ ప్రసార మాధ్యమాలకు, స్కూల్ యాజమాన్యానికి గోపాల్ పోణంగి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement