క్రమశిక్షణ, అంకితభావంకు సంగీతం తోడైతే ఘంటసాల: చంద్రబోస్

Lyricist Chandrabose Comments Bharat Ratna Should Be Given To Ghantasala - Sakshi

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదం ఊపందుకున్న విషయం విదితమే. శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో పలు టీవీ చర్చ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇందులో భాగంగా ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ పాల్గొన్న ఈ ప్రత్యేక కార్యక్రమం, 10 మంది సహ నిర్వాహకులు కలిసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులతో ఘంటసాల శత గళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మొదటి రెండు భాగాల్ని 21, 28 ఆగస్టు నాడు ప్రసారం చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని, 4 సెప్టెంబర్ నాడు మూడవ భాగం ప్రసారం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. చంద్రబోస్ మాట్లాడుతూ.. మాస్టార్‌కి భారతరత్న కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఘంటసాల గురించి చెప్పే అర్హత గాని, అనుభవం కానీ తనకు చాలదని ఆయితే ఆయనపైన తనకున్న అపారగౌరవంతో కొన్ని విషయాలను పంచుకున్నారు. మాస్టార్‌ పాటలు పాడకముందు జాతీయోద్యమంలో పాల్గొన్నారని, ఓ సందర్భంలో జైలు జీవితం కూడా గడిపినట్లు తెలిపారు. నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంకు సంగీతం తోడైతే అది ఘంటసాల మాస్టారని కొనియాడారు. 1944 వరకు పాత్రధారులే వారి వారి పాత్రలకు పాటలు పాడేవారని.. మొట్టమొదటి నేపధ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు అయితే, వారి తరువాత 1945లో స్వర్గసీమ చిత్రంతో మొదలుపెట్టి - 1974 వరకు అలా అప్రతిహతంగా మాస్టారు ప్రయాణం సాగిందని చెప్పారు.

శారద ఆకునూరి (హ్యూస్టన్, USA) బృందం, ఫణి డొక్కా (అట్లాంటా, USA) బృందం, డాక్టర్ రెడ్డి ఉరిమిండి (డల్లాస్, USA) బృందం ఈ కార్యక్రమంలో ఘంటసాల పాటలు పాడి, చక్కటి వ్యాఖ్యానంతో ఆయనను స్మరించుకున్నారు. వీరితో పాటు మరికొందరు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కని పాటలతో అందరిని అలరించారు. శతగళార్చన చివరి భాగంలో ముఖ్య అతిథిగా అనంత శ్రీరామ పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేశారు. శతగళార్చనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని చాలా మంది ప్రముఖులు "ఘంటసాలకి భారతరత్న" విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారని నిర్వాహకులు తెలియజేశారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top