తెయూ(డిచ్‌పల్లి): రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గురువారం ‘వికసిత్ భారత్ యువ సంవాద్ – సంవిధాన్ దివస్ ఎడిషన్’ కార్యక్రమాన్ని తెయూ లా కాలేజ్ సెమినార్ హాల్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా యువజన అధికారి(బీవైవో) బీ రమేశ్ హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిందని, ముఖ్యంగా యువత రాజ్యాంగ స్ఫూర్తిని అవగాహన చేసుకొని సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన వీడియోను ప్రదర్శించారు. క్రీడారంగంలో ప్రతిభ కనబరిచిన కబడ్డీ క్రీడాకారుడు రాజును సన్మానించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపాల్ ప్రసన్న రాణి, ప్రొఫెసర్ జెట్లింగ్ యెల్లోసా, స్రవంతి, హలీమ్ ఖాన్, ఎన్ స్వామిరావు తదితరులు పాల్గొన్నారు.


