● బంగారు ఆభరణాలు, నగదు అపహరణ
మాక్లూర్: తాళం వేసిన రెండిళ్లలో చోరీ జరిగిన ఘటన ఆలూర్ మండలం ఢీకంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మాక్లూర్ ఎస్సై అనిల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిరుమన్పల్లి బాబు తన భార్య డెలివరి కోసం నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి జిల్లా కేంద్రానికి వెళ్లాడు. బుధవారం ఉదయం అదే గ్రామంలో నివాసం ఉండే అతని తమ్ముడి భార్య ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లగా ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. బీరువాలో ఉన్న తులం బంగారం గొలుసు, పది తులాల వెండి, రెండు గ్రాముల బంగారు పుస్తెలు, రూ. 50వేల నగదును దొంగిలించారు. మరో ఘటనలో అదే గ్రామానికి చెందిన కొండ్ర సాయికుమార్ ఇంటి తాళం పగులగొట్టిన దుండగులు ఇంట్లో బీరువాలో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు, తులం వెండి, రూ. లక్ష నగదును అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


