సత్వరమే స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

సత్వరమే స్పందించాలి

Oct 6 2026 1:06 AM | Updated on Oct 6 2026 1:06 AM

22ఏ భూ సమస్యలపై

నిజామాబాద్‌అర్బన్‌ : 22–ఏ నిషేధిత భూములకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అర్జీలపై సత్వరమే స్పందించాలని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్‌రెడ్డి సూచించారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి రెవెన్యూ సంబంధిత అంశాలపై సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెవెన్యూ అధికారులు, తహసీల్దార్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. 22–ఏ నిషేధిత భూములకు సంబంధించి దరఖాస్తుదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని, భూభారతి చట్టం మార్గదర్శకాలను పాటిస్తూ, రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అర్జీలను వెంటవెంటనే పరిష్కరించాలని హితవు పలికారు. అర్హులకు పూర్తి న్యాయం జరిగేలా చొరవ చూపా లని అధికారులకు సూచించారు. దరఖాస్తులను వారం పది రోజుల్లోగా పరిష్కరించాలని స్పష్టమైన గడువు విధించారు. ఇదే తరహాలో భూభారతి, సాదాబైనామా పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం విషయంలోనూ జాప్యానికి తావులేకుండా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువుల శిఖం భూముల కబ్జాలను ఉపేక్షించకూడదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు స్పష్టం చేశారు. అవసరమైన చోట పకడ్బందీగా సర్వే నిర్వహించి, హద్దులను నిర్ధారిస్తూ ప్రభుత్వ భూములు, శిఖం భూములను పరిరక్షించాలని సూచించారు. రెవెన్యూ, అటవీ భూవివాదాల పరిష్కారానికి త్వరలోనే జాయింట్‌ సర్వే చేయిస్తామన్నారు.

ఇసుక రవాణాపై..

నిబంధనలకు అనుగుణంగా ఇసుక రవాణా జరిగేలా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షించాలని అధికారులకు సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం 5 గంటల తరువాత ఇసుక వాహనాలు తిరగొద్దని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు.

ధాన్యం సేకరణ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు..

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. ఏ దశలోనూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపులో పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పటికే నిజామాబాద్‌ నగరంతోపాటు బోధన్‌ పట్టణంలో వారికి ఇళ్లు కేటాయించామన్నారు.

సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్‌ వీ భుజంగరావు, డీఆర్‌వో గీత, ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, విజయకుమారి, ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

రైతులను కార్యాలయాల చుట్టూ

తిప్పుకోవద్దు

వారం రోజుల్లోగా అన్ని

దరఖాస్తులను పరిష్కరించాలి

రెవెన్యూ అధికారులతో

ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement