ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యాయత్నం

Oct 6 2026 1:06 AM | Updated on Oct 6 2026 1:06 AM

పీఎస్‌లో టీస్టాల్‌ నిర్వాహకుడి

● పోలీసుల వేధింపులే కారణమని ఆరోపణ

● ఆందోళనకు దిగిన బాధితుడి

కుటుంబసభ్యులు

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌) : తనపై పోలీసులు తరచూ కేసులు నమోదు చేస్తూ జరిమానాలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ టీ స్టాల్‌ నిర్వాహకుడు భీమ్‌గల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. భీమ్‌గల్‌ పట్టణానికి చెందిన పొలాస సుధాకర్‌(55) పాత బస్టాండ్‌ సమీపంలో టీ స్టాల్‌ నడుపుతున్నాడు. రాత్రి వరకు హోటల్‌ నడుపుతున్నాడంటూ పోలీసులు పలుమారు హెచ్చరించి, మూడుసార్లు జరిమానా విధించారు. తాజాగా మరోసారి జరిమానా విధించడంతోపాటు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని, కోర్టుకు వెళ్లి జరిమానా చెల్లించి రావాలని సూచించారు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన సుధాకర్‌.. ఇతర దుకాణాలు కూడా రాత్రివేళల్లో తెరిచి ఉంటున్నప్పటికీ తన విషయంలోనే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తూ సోమవారం ఉదయం 10 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు, ఇతరులు అప్రమత్తమై మంటలను ఆర్పారు. అనంతరం అంబులెన్స్‌లో నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వేధింపుల వల్లే సుధాకర్‌ ఆత్మహత్మకు యత్నించాడని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించారు. వివిధ పార్టీల, సంఘాల నేతలు వారికి మద్దతుగా నిలిచారు. రాత్రి వేళల్లో టీ విక్రయిస్తున్నాడనే కారణంతో పోలీసులు పలుమార్లు ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు పెట్టీ కేసులు, జరిమానాలు విధించారని, తాజా గా మరోసారి పోలీస్‌ స్టేషన్‌కు రావాలని చెప్పడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడని పేర్కొన్నారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement