ఆరుతడి పంటలపై విస్తృత ప్రచారం! | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలపై విస్తృత ప్రచారం!

Oct 6 2026 1:06 AM | Updated on Oct 6 2026 1:06 AM

ఆరుతడి పంటలనే ఎంచుకోవాలి

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌) : ఎల్‌నినో ప్రభావంతో ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, ప్రాజెక్టుల్లోకి ఆశించిన మేర నీరు చేరకపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే యాసంగి సీజనన్‌లో నీటి ఎద్దడిని తట్టుకునేలా రైతులను సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల (వరి) జోలికి వెళ్లకుండా, తక్కువ నీటి వినియోగంతో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని ఆ శాఖ సూచిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో, సామాజిక మాధ్యమాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తూ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని సాగు చేయదగ్గ ముఖ్యమైన ఆరుతడి పంటల వివరాలను వ్యవసాయ శాఖ విడుదల చేసింది.

శనగ, వేరుశనగ:

అక్టోబర్‌ – నవంబర్‌ నెలలు ఈ పంటలకు అత్యంత అనుకూలం. శనగ పంట కాలం 100 నుంచి 120 రోజులు కాగా, వేరుశనగ 110–130 రోజుల్లో చేతికి వస్తుంది. వీటికి మధ్యస్తంగా లేదా చాలా తక్కువ నీరు సరిపోతుంది.

మినుము, పెసర :

కేవలం 65 నుంచి 90 రోజుల్లోనే కోతకు వచ్చే ఈ తక్కువ కాల పరిమితి పంటలకు నీటి అవసరం చాలా తక్కువ.

ఆవాలు, ధనియాలు:

90 నుంచి 140 రోజుల పంట కాలం ఉండే ఈ వాణిజ్య పంటలను తక్కువ నీటితో సాగు చేసి మంచి లాభాలు గడించవచ్చు.

జొన్న, సజ్జ :

తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఈ తృణధాన్యాల సాగు ఎంతో లాభదాయకం.

పొద్దు తిరుగుడు, నువ్వులు:

మార్కెట్‌లో అధిక డిమాండ్‌ కలిగిన ఈ రెండు పంటలు సాగు చేసేందుకు 80–100 రోజులు మాత్రమే పడుతుంది. డ్రిప్‌ సిస్టమ్‌తో తక్కువ నీటితో సులభంగా పంటలను తీయవచ్చు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులు, చెరువు ల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవు. యాసంగి లో రైతులు ఎక్కువ నీరు అ వసరమయ్యే పంటల జోలి కి వెళ్లకుండా, తక్కువ నీటితో పండే ఆరుతడి పంట లను ఎంచుకోవాలి. శనగ, మినుము, పెసర, వేరు శనగ లాంటి పంటల ద్వారా మంచి లాభాలు సాధించవచ్చు. రైతులకు దీనిపై వ్యవసాయాధికారులతో విస్తృత అవగాహన కల్పిస్తున్నాం.

– వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో అప్రమత్తమైన

వ్యవసాయ శాఖ

యాసంగిలో తక్కువ నీటి పంటల

సాగు కోసం కసరత్తు

క్షేత్రస్థాయిలో రైతులను సన్నద్ధం

చేస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement