● వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో భాగంగా కొనసాగుతున్న ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను ఏఈఆర్వోలు, సూపర్‌వైజర్లు నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఎస్‌ఐఆర్ కార్యక్రమ పురోగతి, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో సీఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎల్‌వోలు వెబ్‌సైట్‌లో ఓటర్ల వివరాలు నమోదు చేసే సమయంలో అనేక పొరపాట్లు జరిగినట్లు గుర్తించామని, వాటి కారణంగా అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోతున్నాయనే ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. బీఎల్‌వోలు నమోదు చేసిన ప్రతి వివరాన్ని ఏఈఆర్‌వోలు, సూపర్‌వైజర్లు తప్పనిసరిగా క్రాస్ వెరిఫై చేయాలని, లోపాలను గుర్తిస్తూ సరిదిద్దాలని ఆదేశించారు. అనవసర తప్పిదాలకు ఆస్కారం కల్పిస్తే సంబంధిత బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను వచ్చే శనివారం వరకు పూర్తి చేయాలని ఆదే శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహించామని తెలిపారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాలలో ప్రక్రియ పూర్తయ్యిందని, మిగతా సెగ్మెంట్లలో వివరాల నమోదు ప్రక్రియను పునఃపరిశీలన చేస్తున్నట్లు వివరించారు. వీసీలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


