మాక్లూర్: మండలకేంద్రంలో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలకేంద్రంలోని రామకృష్ణ తన భార్యతో కలిసి టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు ఉండగా తన అన్న కూతురు సావిత్రి(17)ని కొన్నేళ్లుగా పెంచుకుంటున్నాడు. సావిత్రి తండ్రి గతంలో మృతిచెందగా, తల్లి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. రామకృష్ణ సోమవారం సరుకులు తేవడానికి భార్యతో కలిసి నిజామాబాద్ వెళ్లాడు. తిరిగి సాయంత్రం వారు ఇంటికి వచ్చేసరికి బాలిక ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
విద్యుత్ షాక్‌తో
ఒకరికి తీవ్రగాయాలు
రెంజల్: ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామంలో ప్రయివేట్ హెల్పర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. రెంజల్ గ్రామానికి చెందిన చినరాజం అనే వ్యక్తి ప్రయివేట్ హెల్పర్‌గా పనులు చేసుకుంటున్నారు. గ్రామం పక్కనే ఆయనకు ఎకరం భూమి ఉంది. గత శుక్రవారం ట్రాన్స్‌ఫార్మర్ ఫీజు కాలిపోవడంతో అప్పటి నుంచి స్థానిక లైన్‌మన్‌కు సమారాచం అందించారు. ఆయన స్పందించక పోవడంతో సోమవారం పొలం వద్దకు చేరుకుని లైన్‌ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ ద్వార సమాచారం అందించారు. ఆయన ఆదేశాల మేరకు సబ్‌స్టేషన్ నుంచి ఎల్‌సీ(లైన్‌క్లీయర్) ఇచ్చారు. ఇచ్చిన సమయంలో పనులు పూర్తి చేసుకునేందుకు చినరాజం 11కేవీ విద్యుత్ లైన్ ఎక్కి ఫీజు వేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి కిందపడ్డాడు. గుర్తించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు కుటుంబీకులు తెలిపారు.


