చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

రైతులు ఆందోళన చెందవద్దు

డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి

డిచ్‌పల్లి(నిజామాబాద్‌ రూరల్‌): కాంగ్రెస్‌ రైతు ప్రభుత్వమని, జిల్లాలో యాసంగి సీజన్‌లో పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి పేర్కొన్నారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని కేఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తూ మోసం చేస్తున్నాయని, వారి మాయమాటలను రైతులు నమ్మవద్దని సూచించారు. జిల్లాలో సన్నరకం వడ్లతోపాటు దొడ్డు రకం వడ్లను సాగు చేశారని, కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడంతోనే దొడ్డు వడ్ల కొనుగోళ్లలో ఆలస్యం జరిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డిలు కలెక్టర్‌ ద్వారా ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 4.35 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, 737 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్మూర్‌, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌ ప్రాంతాల్లో 32 మొక్కజొన్న కేంద్రాలనూ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఎక్కడైనా ఇబ్బందులుంటే రైతుల వద్దకే కాంగ్రెస్‌ నాయకులు వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నారని తెలిపారు. రైతులకు ధాన్యం డబ్బులు రోజూ సుమారు రూ.70 కోట్ల వరకు ఖాతాల్లో జమచేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల కోసం వేగవంతంగా పనిచేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం మానుకోవాలని నగేష్‌ రెడ్డి హితవు పలికారు. సమావేశంలో కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, డీసీసీ ఉపాధ్యక్షుడు అమృతాపూర్‌ గంగాధర్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ చిన్నోల్ల నర్సయ్య, కార్యదర్శి డాక్టర్‌ షాదుల్లా, సర్పంచుల ఫోరం రూరల్‌ అధ్యక్షుడు గొట్టిపాటి వాసుబాబు, నాయకులు న్యాస రాజేశ్వర్‌, సాయిలు, రాజారాం, దాసు, వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement