కందకుర్తిలో శ్రీ కేశవ స్ఫూర్తి మందిరం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : దేశ నిర్మాణం, భవిష్యత్‌ను శతాబ్దం క్రితమే ఊహించిన డాక్టర్ కేశవ బలిరాం పంత్ హెడ్గేవార్ పూర్వీకుల గ్రామం కందకుర్తి. ఆయన 1925 విజయ దశమి రోజున నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని హెడ్గేవార్ పూర్వీకుల గ్రామమైన కందకుర్తిలో కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో ‘శ్రీ కేశవ స్ఫూర్తి మందిరం’ను నిర్మిస్తున్నారు. దీనిని ఈనెల 11వ తేదీన ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ ప్రారంభించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగా లు కందకుర్తి గ్రామంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పర్యటన పూర్తయ్యేవరకు గ్రామం హైసెక్యూరిటీ జోన్ గా ఉండనుంది. కా ర్యక్రమానికి ఎంపిక చేసి న ప్రాంతాల నుంచి పరిమి త సంఖ్యలో ఆహ్వానం అందుకున్న స్వ యంసేవకులతోపాటు కొద్దిమందిని మాత్రమే అనుమతించనున్నారు. భగవత్ శనివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 9గంటల వరకు కందకుర్తిలో ఉండనున్నారు. ఆయన ముందుగా కేశవమూర్తి, రుక్మిణి సమేత విఠలేశ్వర, స్కంద దేవాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కేశవ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రారంభించి లోకార్పణం చేస్తారు. సమీపంలో ఏర్పాటు చేయనున్నా సభావేదికపై ప్రసంగిస్తారు.
స్కందపురి.. కందకుర్తి
గోదావరి, మంజీర, హరిద్ర నదుల సంగమ స్థానమైన కందకుర్తికి పౌరాణిక నేపథ్యమూ ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చినట్లుగా చెబుతారు. కందకుర్తి అసలు పేరు స్కందపురి. దేవతల సైన్యాధిపతి అయిన సుబ్రహ్మణ్యస్వామి గ్రామంలో స్కందుడిగా వెలవగా.. ఈ ఊరి పేరు స్కందపురిగా, కాలక్రమంలో కందకుర్తిగా మారినట్లు చరిత్ర చెబుతోంది. జీర్ణదశలో ఉన్న స్కందుడి ఆలయం స్థానంలో ఇటీవల నూతన ఆలయాన్ని నిర్మించారు. పౌరాణిక నేపథ్యం ఉన్న కందకుర్తి చారిత్రకంగానూ ప్రత్యేకత కలిగి ఉంది. ప్రస్తుతం దేశభక్తి స్ఫూర్తి కేంద్రంగా నిలుస్తోంది. ప్రతి సంఘ్ స్వయంసేవక్ ఒక్కసారైనా ఈ గ్రామాన్ని సందర్శించాలని కోరుకోవడం విశేషం. శ్రీశైలంలో ఆర్‌ఎస్‌ఎస్ నిర్మించిన ఛత్రపతి శివాజీ స్ఫూర్తి మందిరం మాదిరిగా కందకుర్తిలో కేశవ స్ఫూర్తి మందిరాన్ని నిర్మించారు. అదేవిధంగా డాక్టర్ హెడ్గేవార్ కులదైవం కేశవమూర్తి ఆలయం సైతం ఉంది.
కేశవ సేవా సమితి సేవా కార్యక్రమాలు..
కేశవ సేవాసమితి సుదీర్ఘకాలంగా కందకుర్తిలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శిశుమందిర్ పాఠశాలలో నామ మాత్ర ఫీజులతో సంస్కారం, విలువలతో కూడిన విద్యను వేలమంది విద్యార్థులకు అందించింది. సేవలను కొనసాగిస్తోంది. మహారాణి అహల్యాబాయి హోల్కర్ పేరుతో ఘాట్‌లు నిర్మించి, గోదా వరి హారతి, ఇతర ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోంది. ప్రస్తుతం స్ఫూర్తి మందిరం పక్కనే పాఠశాల, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కూడా నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలోని మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చేందుకు ఈ ప్రాజెక్టు ద్వారా కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నారు. అతిథులకు విశ్రాంతి భవనాలు సైతం నిర్మిస్తున్నారు. దేశభక్తి, దైవభక్తి, నైపుణ్యాభివృద్ధి లక్ష్యాలతో ముందుకు వెళ్తోంది ఆర్‌ఎస్‌ఎస్.
సభాప్రాంగణం ఏర్పాట్లు
స్ఫూర్తి కేంద్ర నిర్మాణం ఇలా..
శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం మాదిరిగా కేశవ స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో డాక్టర్ హెడ్గేవార్ విగ్రహం, ఆయన జీవిత విశేషాలతో కూడిన ఫొటో గ్యాలరీ, దేశం కోసం ఆయన ఆకాంక్షలతో కూడిన వివరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక మొదటి అంతస్తులో భరతమాత విగ్రహం, డాక్టర్ హెడ్గేవార్ జీవిత విశేషాలు తెలిపే వీడియో ప్రదర్శన గది, మరో పక్క డాక్టర్ హెడ్గేవార్ వ్యక్తిగతంగా ఉపయోగించిన కొన్ని వస్తువులు, ఆయన స్వయంగా రాసిన కొన్ని లేఖల ప్రతులు, కొన్ని విలువైన పుస్తకాలు ప్రదర్శనకు ఉంచనున్నారు. దీన్ని పూర్తిగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల శ్రద్ధ కేంద్రంగా మార్చనున్నారు. భరతమాత, హెడ్గేవార్ విగ్రహాలను అయోధ్య బాలరాముడి విగ్రహం తయారుచేసిన మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్‌తో తయారుచేయించి తీసుకొచ్చారు.
దేవతల సైన్యాధిపతి సుబ్రహ్మణ్య స్వామి వెలిసిన గ్రామం.. జాతీయ సమైక్యత, నైతిక విలువలు, సామాజిక సామరస్యాన్ని చాటి చెబుతున్న స్వయం సేవకులు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలనుకునే కందకుర్తి ‘స్ఫూర్తి కేంద్రం’గా వెలుగొందనుంది. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ పూర్వీకుల గ్రామమైన కందకుర్తిలో ‘శ్రీ కేశవ స్ఫూర్తి మందిరం’ నిర్మాణం పూర్తికాగా.. ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ ఈనెల 11వ తేదీన ప్రారంభించనున్నారు.
నిబంధనల మేరకే కార్యక్రమం
కందకుర్తి చిన్నగామం కావడంతోపాటు భద్రత కారణాలను దృష్టిలో ఉంచుకుని నిబంధనల మేరకే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సీనియర్ స్వయం సేవకులను మాత్రమే ఆహ్వానించడం జరిగింది. ముందుగా ఎంపిక చేసినవారికి మాత్రమే అనుమతి ఉంది. లోకార్పణ తరువాత దశలవారీగా అందరికీ స్ఫూర్తి మందిర సందర్శనకు అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి వస్తున్నారనే తప్పుడు వార్తలను పట్టించుకోవద్దు. డాక్టర్ హెడ్గేవార్‌ను దైవంలా ఆరాధించే వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నారు. వారందరికీ కందకుర్తి ఒక స్ఫూర్తి కేంద్రం. దీంతో ఇక్కడ హెడ్గేవార్ స్మృతి మందిరం, స్ఫూర్తి కేంద్రంగా, నిరంతర స్ఫూర్తిని నింపే శ్రద్ధ కేంద్రంగా ఉండనుంది. – వాసు, సేవాభారతి
తెలంగాణ రాష్ట్ర సంఘటన కార్యదర్శి
త్రివేణి సంగమ క్షేత్రంలో
చివరి దశకు ‘కేశవ స్ఫూర్తి మందిరం’
ఈనెల 11న ప్రారంభించనున్న
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం..
కేంద్ర బలగాల ఆధీనంలోకి
కందకుర్తి గ్రామం
11వ తేదీ వరకు హై సెక్యూరిటీ జోన్


