● నాలుగు నెలల క్రితం జిల్లాలో సంచారం
● పలు జిల్లాలను చుట్టి ఇటీవల మళ్లీ కామారెడ్డికి రాక
● కదలికలను గమనిస్తున్న అటవీశాఖ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో గతేడాది డిసెంబర్ రెండో వారంలో దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, పాల్వంచ, మాచారెడ్డి మండలాల్లో పులి సంచారం కనిపించింది. పలుచోట్ల పశువులపై దాడి చేసి హతమార్చింది. తొలుత దోమకొండ మండలం అంబారీపేటలో దాని కదలికలు బయటపడ్డాయి. అక్కడి నుంచి బీబీపేట, భిక్కనూరు మండలాల్లో తిరిగిన పులి తర్వాత పాల్వంచ, మాచారెడ్డి మండలాలలో సంచరించింది. దీంతో అటవీ శాఖ అధికారులు పులి కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో కెమెరాలను ఏర్పాటు చేశారు. మాచారెడ్డి రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతం గుండా పక్క జిల్లాలకు పులి వెళ్లిపోయినట్లు గుర్తించారు. మాచారెడ్డి రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతం మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం గుండా సిద్దిపేట, జనగామ జిల్లాల దాకా వెళ్లి తిరిగి కరీంనగర్ వైపు వచ్చినట్లు గుర్తించారు. అక్కడి నుంచి జగిత్యాల జిల్లాలో తిరిగి నిజామాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సంచరించింది. కమ్మర్‌పల్లి, సిరికొండ మండలాల్లోని అటవీ ప్రాంతంలో దాని కదలికలు వెలుగు చూశాయి. తాజాగా కామారెడ్డి –నిజామాబాద్ జిల్లాల సరిహద్దు అడవుల్లో పులి తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈనెల 5న మాచారెడ్డి రేంజ్ అటవీ సరిహద్దుకు సమీపంలో కదలికలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. అక్కడి అధికారులను అప్రమత్తం చేశారు. రెండు రోజులుగా పులి అదే ప్రాంతంలో తిరుగుతున్నట్లు భావిస్తున్నారు. దాదాపు నాలుగు నెలల కాలంగా పులి ఎక్కడెక్కడో తిరిగి మన జిల్లా అటవీ ప్రాంతానికి చేరుకుంది.
సేఫ్ జోన్‌గా ఎంచుకుందా...
గోదావరి నది దాటి వచ్చిన పెద్దపులి.. నాలుగు నెలలుగా ఈ ప్రాంతంలోనే తిరుగుతోంది. తొలుత కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారీపేటలో దాని కదలికలు బయటపడ్డాయి. అక్కడి నుంచి పలు ప్రాంతాల్లో తిరిగి, పొరుగు జిల్లాలలో సంచరించి తిరిగి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో తచ్చాడుతోంది. ఇటీవల కమ్మర్‌పల్లి, సిరికొండ మండలాల్లోని అటవీ ప్రాంతంలో దాని కదలికలు వెలుగు చూశాయి. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల సరిహద్దు అడవుల్లో తిరుగుతున్న పెద్దపులి.. ఈ ప్రాంతాన్ని సేఫ్ జోన్‌గా ఎంచుకుని ఇక్కడిక్కడే తిరుగుతున్నట్లు భావిస్తున్నారు.
మనుషుల జోలికి వెళ్లని పులి
ఈ ప్రాంతంలో నాలుగు నెలలుగా సంచరిస్తు న్న పులి.. ఇప్పటిదాకా ఎక్కడా మనుషుల మీద దాడి చేయలేదు. ఆకలి తీర్చుకునేందుకు పశువులపై దాడి చేస్తోంది. అటవీ ప్రాంతంలో పంట చేల వద్దకు రైతులు వెళ్తుంటారు. పశు వులు, మేకలు, గొర్రెలను అటవీ ప్రాంతానికి తీసుకువెళతారు. ఎక్కడ కూడా మనుషుల మీ దకు రాకపోవడం కాస్త ఊరటనిస్తోంది. అయినప్పటికీ అటవీ ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. చీకటి పడిన తర్వాత పొలాల వద్దకు వెళ్లొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
అప్రమత్తంగా అటవీ అధికారులు
పెద్దపులి ఎక్కడెక్కడ తిరుగుతుందన్న దానిపై అటవీ శాఖ అధికారులు దృష్టి సారించారు. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ విభాగం పులి కదలికలను గమనిస్తూ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందిస్తోంది. దీంతో అటవీ అఽధికారులు ఆయా ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేసి దాని కదలికలను నిర్ధారించుకుంటున్నారు. పులి సంచరించిన ప్రాంతానికి వెళ్లి పాదముద్రలు సేకరించి దాని కదలికలు ఎటువైపు ఉన్నాయన్నది అంచనా వేసుకుని ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే రోజూ కిలోమీటర్ల కొద్దీ తిరుగుతున్న పులి.. ఎటు నుంచి ఎటువైపు వెళ్తోందన్న దానిపై అప్పటికప్పుడు అంచనా వేయలేకపోతున్నారు.


