బోధన్ బల్దియాలో త్రిముఖ పోరు
● కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ ఢీ అంటే ఢీ
● తామేమీ తక్కువ కాదంటున్న బీజేపీ
బోధన్‌టౌన్: బోధన్ బల్దియాలో త్రిముఖ పోరు నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆ ర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు గెలుపు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రకటించిన రిజర్వేషన్లు వార్డుల్లో మారడంతో పాటు చైర్మన్ పీఠం జనరల్ అవడంతో పురపోరు రసవత్తరంగా సాగనుంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమయ్యాయి. రిజర్వేషన్లు అనుకూలంగా రాక పోవడంతో పలువురు మాజీలు, ఆశావహులు ఇప్పటికే పార్టీలు మారారు. అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి రిజర్వేషన్లు ఖరారు అయిన అనంతరం బలమైన అభ్యర్థులను వార్డుల్లో నిలిపి చైర్మన్ పీఠం అధికార పార్టీ కై వసం చేసుకోవాలని చూస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్ సైతం తామేమి తక్కువ కాదన్నట్లు రంగంలోకి దిగి గెలుపు గుర్రాల వేటలో ముందుకు సాగుతున్నారు. ఈ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు వ్యవహరిస్తున్న క్రమంలో తమ ఓటు బ్యాంకు తమకు ఉందని గతంలో సాధించిన ఎంఐఎం 11 సీట్ల కంటే మ్యాజిక్ ఫిగర్‌ను సాధించేందుకు 38 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాజీ చైర్మన్ తూము పద్మాశరత్ రెడ్డి మరోసారి చైర్మన్ పీఠంపై గురి పెడుతున్నట్లు సమాచారం. అలాగే మాజీ ఎమ్మెల్యే తన సతీమణి అయేషా ఫాతిమాను బరిలో దింపి చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీ సైతం చైర్మన్ పీఠంపై కన్నేసి ఎలాగైనా బల్దియాను కై వసం చేసుకోవాలని చూస్తున్నారు. బీజేపీ పార్టీ నాయకులు మాత్రం ఈ మూడు పార్టీల త్రిముఖ పోరులో గట్టి పోటీని ఇచ్చేందుకు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి 120 దరఖాస్తులు
అధికార కాంగ్రెస్ పార్టీ పుర పోరులో దిగేందుకు మాజీలు, ఆశావహుల నుంచి ఇప్పటి వరకు 38 వార్డుల నుంచి 120 మంది పోటీ చేసేందుకు దరఖాస్తులు చేశారు. వచ్చిన దరఖాస్తుల నుంచి బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేదిశగా పార్టీలో ఆలోచనలు చేస్తోంది.
బీఆర్‌ఎస్ నుంచి 70..
అధికార కాంగ్రెస్ పార్టీతో ఢీ కొనడానికి బీఆర్‌ఎస్ పార్టీ నుంచి 38 వార్డుల నుంచి ఽ70 మంది ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మాజీలు, ఆశవాహులు పోటీకి సిద్ధంగా ఉండగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు పార్టీ నాయకులు సమాయత్తం అవుతున్నారు.
ఎంఐఎం నుంచి 120..
గత ఎన్నికల్లో 38 వార్డులకు గాను 11 సీట్లు సాధించి, 4 వార్డులను అతితక్కువ ఓట్లతో ఓడిన మజ్లిస్ పార్టీ నుంచి మాజీలు, ఆశవాహులు పోటీకి సై అంటున్నారు. 28 వార్డుల నుంచి ఇప్పటికే 120 దరఖాస్తులు వచ్చాయి.
బీజేపీ నుంచి 40..
బీజేపీ నుంచి పోటీ చేయడానికి 38 వార్డుల నుంచి 40 మంది దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల నుంచి ఎంపిక చేసి వార్డుల్లో గట్టి పోటీని ఇచ్చే అభ్యర్థుల వేటలో పార్టీ ముఖ్య నాయకులు నిమగ్నమయ్యారు.


