జిల్లాలో కాదు.. జిల్లాకేంద్రంలోనే!
ప్రభుత్వ ఆదేశాల మేరకే..
మోర్తాడ్(బాల్కొండ): గ్రంథాలయాల ఆవశ్యకత ను వివరించడానికి నిర్దేశించిన జాతీయ గ్రంథాల య వారోత్సవాలను జిల్లావ్యాప్తంగా కాకుండా జి ల్లాకేంద్రంలోనే నిర్వహించనున్నారు. గతంలో జి ల్లావ్యాప్తంగా ఉన్న అన్ని శాఖ గ్రంథాలయాల్లోనూ వారోత్సవాలను నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం జిల్లాకేంద్రంలోనే వారోత్సవాలను నిర్వహించనుండటంతో పుస్తక ప్రియులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతియేటా నవంబర్ 14 నుంచి..
జిల్లాలోని వివిధ మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీలలో 24 గ్రంథాలయాలు కొనసాగుతున్నాయి. గ్రంథాలయ వారోత్సవాలను ప్రతి ఏటా నవంబర్ 14 నుంచి వారం రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కానీ కొన్నేళ్ల నుంచి నిధుల కొరతతో పాటు వివిధ కారణాలతో గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించడం లేదు. వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, పాటల పోటీలు, రంగవళ్లులు, చిత్రలేఖనం, పుస్తక పఠనం తదితర కార్యక్రమాలను నిర్వహించేవారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసేవారు. ఒక్కో శాఖ గ్రంథాలయంలో వారోత్సవాల నిర్వహణకు కనీసం రూ.5వేల వరకు నిధులు అవసరం అవుతాయి. కానీ సిబ్బంది, నిధుల కొరతతో ప్రస్తుత సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను కేవలం జిల్లా కేంద్రంలోని ప్రధాన గ్రంథాలయంలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2018 నుంచి నిలిచిపోయి..
గ్రంథాలయ వారోత్సవాలను 2018 వరకు ప్రతి ఏటా ఎంతో సంబరంగా నిర్వహించారు. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా వారోత్సవాలను రద్దు చేశారు. 2019లో నిధుల కొరత కారణంగా నిలిపివేశారు. 2020లో కరోనా, 2021లో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వారోత్సవాల నిర్వహణ సాగలేదు. 2018లో వారోత్సవాలకు పట్టిన గ్రహణం ఇప్పటికీ వీడటం లేదు. తాజాగా శాఖా గ్రంథాలయాల్లో వారోత్సవాలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి అన్ని శాఖగ్రంథాలయాల్లో వారోత్సవాలను నిర్వహించాలని పాఠకులు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా కేంద్రంలోని ప్రధాన గ్రంథాలయంలోనే వారోత్సవాలను నిర్వ హిస్తున్నాం. గతంలో ఎన్నికలు, కరోనా తదితర కారణాలతో వారోత్సవాలు రద్దు అయ్యాయి. ఇప్పుడు నిధులు లేకపోవడంతోపాటు శాఖ గ్రంథాలయాల్లో సిబ్బంది కొరతతో వారోత్సవాలను జిల్లా కేంద్రానికే పరిమితం చేశారు. –బుగ్గారెడ్డి,
జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జిల్లాకేంద్రంలోనే నిర్వహణ
గతంలో శాఖ గ్రంథాలయాల్లోనూ నిర్వహించిన వైనం
నిధులు, సిబ్బంది కొరతే కారణం


