క్రైం కార్నర్
డ్రంకన్‌డ్రైవ్ కేసులో పలువురికి జైలుశిక్ష
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలో ఇటీవల పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, సాలూర మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన చింతల సాయిలు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. గురువారం అతడిని బోధన్ కోర్టులో హాజరుపర్చగా, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్పసాయి 3 రోజుల జైలుశిక్ష, రూ. 2 వేల జరిమాన విధించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు.
వర్ని: మండలంలో ఇటీవల పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, రుద్రూర్ మండలం అంబం గ్రామానికి చెందిన ఇసుక లక్ష్మణ్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. గురువారం అతడిని బోధన్ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి 2రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై మహేష్ వెల్లడించారు.
వేల్పూర్: వేల్పూర్ క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా భీమ్‌గల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు, వేల్పూర్‌కు చెందిన ఒకరు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. వారిని గురువారం ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున రూ.30వేల జరిమానా విధించినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఇటీవల డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని గురువారం నిజామాబాద్ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి 8 మందికి జైలుశిక్ష, 13 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్‌అలీ తెలిపారు. 13 మందికి రూ.10వేల చొప్పున జరిమానా విధించగా, ఐదుగురికి ఏడు రోజుల జైలు శిక్ష, ఒకరికి ఐదు రోజులు, మరొకరికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు వివరించారు.
వాహనం నడిపిన మైనర్లకు..
నిజామాబాద్ అర్బన్: నగరంలో ఇటీవల పలువురు మైనర్లు వాహనాలు నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారిని గురువారం నిజామాబాద్ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి వారితో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రధాన రోడ్లపై ప్రచారం చేయించాలని తీర్పు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.


