రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
సుభాష్‌నగర్: నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు జరపడం తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వచ్చిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.. రాత్రి వరకూ తనిఖీలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలు జరుగుతుండటంపై ప్రభుత్వానికి, ఏసీబీకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారుల బృందం విస్తృతంగా తనిఖీ చేపట్టింది. కార్యాలయంలోని పెండింగ్ రికార్డులతోపాటు రిజిస్ట్రేషన్ల వివరాలపై ఆరా తీశారు. అధికారులు, సిబ్బందిని విచారించి, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
డాక్యుమెంట్ల ఆధారంగా..
అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొన్ని నెలలుగా నాన్ లే అవుట్ ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. డీఐజీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అయి ఉండి.. అర్బన్ కార్యాలయంలో ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న ఓ సబ్ రిజిస్ట్రార్ కనుసన్నల్లోనే ఈ తతంగమంతా జరుగుతుందనే ఆరోపణలు కొందరు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా తెలిసింది. అడిగినంత ఇవ్వకుంటే నిబంధనల సాకు చూపి డాక్యుమెంట్‌ను తిరస్కరిస్తున్నారని, అడిగినంత ఇస్తే.. నిబంధనల్లోని లొసుగులను ఆసరా చేసుకొని డాక్యుమెంట్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ దాడులు జరగడం చర్చకు దారితీసింది. ఇటీవల జరిగిన డాక్యుమెంట్ల నెంబర్ల ఆధారంగా రికార్డులను పరిశీలిస్తూ.. తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
రిజిస్ట్రేషన్ శాఖలో కలకలం..
ఏసీబీ తనిఖీలతో జిల్లాలోని ఐదు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో అప్పటి నుంచి ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్లతో నెట్టుకొస్తున్నారు. తాజాగా ఏసీబీ సోదాలు చేయడంతో కొంతమంది సబ్ రిజిస్ట్రార్లకు టెన్షన్ నెలకొంది.
మూసి ఉన్న దస్తావేజు దుకాణాలు
‘అర్బన్’లో రాత్రి వరకూ తనిఖీలు
దుకాణాలు మూసేసిన
డాక్యుమెంట్ రైటర్లు
రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో భాగమేనంటున్న ఏసీబీ అధికారులు
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు


