కదిలిన రథం.. వెలిగిన అగ్నిగుండం
● వైభవంగా కొనసాగిన రథోత్సవం
● ముగిసిన కాలభైరవుడి జన్మదిన వేడుకలు
రామారెడ్డి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి (రా మారెడ్డి) కాలభైరవుడి జన్మదిన వేడుకలు గురువా రం నిర్వహించిన రథోత్సవం, అగ్నిగుండాలతో(దక్షయజ్ఞం) ముగిశాయి. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభమైన రథోత్సవం ఇసన్నపల్లి, రామారెడ్డి గ్రామాలలో కొనసాగింది. యువకులు రథాన్ని లాగడానికి భారీగా తరలివచ్చారు. కాలభైరవుని నామస్మరణతో రెండు గ్రామా లు మారుమోగాయి. మహిళలు మంగళహారతు లతో కాలభైరవుడికి స్వాగతం పలికి కానుకలు సమర్పించారు. రథం ఆలయ ప్రాంగణానికి చేరుకోగానే వేడుకల్లో ముఖ్యమైన అగ్ని గుండాలను (దక్షయజ్ఞం) వీరశైవ మహేశ్వరులు ప్రారంభించారు. అగ్నిగుండాలు ముగిసిన అనంతరం ఆలయంలో దండకాలు వేశారు. భక్తులకు దాతల సాయంతో అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో ప్రభుగుప్తా తెలిపారు. స్వామివారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.80 లక్షలు మంజూరు చేయించానని, రానున్న కాలంలో రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.


