డయాబెటిస్ నివారణ సాధ్యమే!
అవగాహన అవసరం..
● ముందస్తు గుర్తింపు,
జీవనశైలి మార్పులు కీలకం
● నేడు ప్రపంచ మధు మేహ దినోత్సవం
నిజామాబాద్‌నాగారం: మధుమేహం(డయాబెటిస్) నివారణ సాధ్యమేనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాధిపై అవగాహన, ముందస్తు గుర్తింపు, నివారణ చర్యలు, జీవనశైలి మార్పులతో మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చంటున్నారు. నేడు ప్రపంచ మధుమేహా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 14న నిర్వహిస్తుంటారు. మధుమేహం వ్యాధిపై అవగాహన పెంచడానికి, నివారణ, రోగ నిర్ధారణ, చికిత్సను ప్రోత్సహించడానికి, ప్రతియేటా నిర్వహిస్తారు. ప్రస్తుతం మధుమేహం ఇప్పుడు పెద్దవారికే కాకుండా యువతలో కూడా వేగంగా పెరుగుతోందని తాజా గణాంకాలు చెబు తున్నాయి. ఈక్రమంలో ప్రతిఒక్కరూ నివారణ చర్యలు పాటించాలని వైద్యులు పేర్కొంటున్నారు.
లక్షణాలు ఇలా..
మధుమేహం చిన్న వయస్సులోనే ఎక్కువగా కనిపించడం ఆందోళనకరం. ముందస్తు గుర్తింపు, క్రమమైన పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడం ద్వారా దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చు. మధుమేహానికి సూచించే ప్రధాన లక్షణాలు అధిక దాహం, తరచూ మూత్రవిసర్జన, బరువు తగ్గడం, అలసట, గాయాలు ఆలస్యంగా మానడం. అధిక బరువు, కుటుంబ చరిత్ర, రక్తపోటు లేదా వ్యాయామం లేకపోవడం వంటి ప్రమాదకర అంశాలు ఉన్నవారు క్రమం తప్పకుండా రక్త చక్కెర పరీక్ష చేయించుకోవాలి.
నివారణ చర్యలు..
●సమతుల ఆహారం: పిండి పదార్థాలు, కూరగాయలు, తేలిక ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలి.
●నిత్య వ్యాయామం: రోజూ కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామం చేయాలి.
●దూమపానం, మద్యం మానేయాలి.
●వైద్యుల సూచనల ప్రకారం మందులు, పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి.
రోజువారి చిన్న మార్పులు ఉదాహరణకు వ్యాయామం పెంచడం, ప్రాసెస్డ్ ఆహారం తగ్గించడం వంటివి శరీంలో చక్కెర నియంత్రణలో గణనీయమైన మెరుగుదలను తీసుకువస్తాయి. మధుమేహం నివారణ సాధ్యమే. ప్రతిఒక్కరూ వ్యాధిపై అవగాహన కలిగి ఉండటంతోపాటు, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తేనే వ్యాధిని నివారించవచ్చు.
–దత్తు రాజ్, జనరల్ మెడిసిన్ వైద్యుడు,
మెడికవర్ హాస్పిటల్, నిజామాబాద్
డయాబెటిస్ నివారణ సాధ్యమే!


