బురదలో దిగబడిన స్కూల్ వ్యాన్
నందిపేట్: మండల కేంద్రంలోని బర్కత్‌పుర కాలనీలో శుక్రవారం స్కూల్ వ్యాను బురదలో దిగబడింది. దీంతో విద్యార్థులకు ప్రమాదం తప్పింది. ఉదయం బర్కత్‌పుర కాలనీ పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లేందుకు టాటా ఏసీ వ్యాను కాలనీ గుండా వెళ్తుండగా బురదలో దిగబడింది. దీంతో వ్యానులో ఉన్న విద్యార్థులను కిందికి దించడంతో ప్రమాదం తప్పింది.
అశోక్‌నగర్‌లో చోరీ
నిజామాబాద్ అర్బన్: నగరంలోని అశోక్‌నగర్‌లో ఉన్న ఓ ఇంట్లో శుక్రవారం తెల్లవారు జామున చోరీ జరిగినట్లు ఒకటో టౌన్ పోలీసులు తెలిపారు. కాలనీకి చెందిన బాలరాజు రాత్రి తన ఇంటికి గడియ వేయకుండా ఇంట్లో నిద్రించాడు. దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న తులం బంగారాన్ని దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చిట్టీ వ్యవహారంలో తగాదా..
నగరంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న ఓ మహిళ నెలవారి చిట్టీలు కొనసాగిస్తున్నారు. గడువు ముగిసినా డబ్బులు ఇవ్వడం లేదని కొందరు బాధితులు మహిళతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఫిర్యాదు లేకున్నా పోలీసులు జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం బయటపడకుండా పోలీసులు జాగ్రత్త వహించారని ఆరోపణలు ఉన్నాయి.


