కూలీల కొరత.. నిలిచిన కాంటా..
కుప్పలు పోసి వారం అయింది..
కూలీలను రప్పిస్తున్నాం..
● ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో
సాగని పనులు
● బీహార్ నుంచి వచ్చే కూలీల
సంఖ్య తగ్గిపోవడమే కారణం
మోర్తాడ్(బాల్కొండ): ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూలీల కొరత వేధిస్తోంది. బీహార్ నుంచి రావాల్సిన కూలీలు పూర్తిస్థాయిలో రాకపోవడంతో ధాన్యం కొనుగోళ్లకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. స్థానికంగా ఉన్న హమాలీలతో ధాన్యం తూకం వేసే పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో కూలీల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో కొన్నేళ్లుగా బీహార్ నుంచి వలస వచ్చే కూలీలపైనే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆధారపడుతున్నారు. ఒకవేళ మిల్లర్లు ధాన్యంను తూకం వేయించినా వారు కూడా బీహార్ కూలీలపైనే ఆధారపడుతున్నారు. బీహార్ నుంచి కూలీలను తరలించడానికి ప్రతి గ్రామంలో మధ్యవర్తులు ఉన్నారు. కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న సహకార సంఘాలు, సమాఖ్యల ప్రతినిధులు ఈ మధ్యవర్తులను ఆశ్రయించి వారి సహకారం కోరుతున్నారు. దసరా, దీపావళి తర్వాత బీహార్ వారికి ప్రత్యేక పండుగలు ఉండటంతో కూలీలు తరలిరావడానికి ఆటంకం ఏర్పడుతుందనే వాదన వినిపిస్తోంది.
కొన్ని చోట్లనే అందుబాటులో..
జిల్లాలో సహకార సంఘాలు, మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో సుమారు 676 కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే 550కిపైగా కొనుగోలు కేంద్రాలను అధికారికంగా ప్రారంభించారు. మిగిలిన కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ కొన్ని కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తూకం వేయడానికి కూలీలు ఉన్నారు. అనేక చోట్ల రెండు, మూడు రోజుల్లో కూలీలు వస్తారని, వారు రాగానే ధాన్యం తూకం వేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కో కాంటా నిర్వహించే చోట ఏడుగురు నుంచి 10 మంది వరకూ కూలీలు అవసరం. వారే ధాన్యం తూకం వేసి లారీల్లో లోడ్ చేస్తారు. ఇప్పటికే బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో వరి కోతలు చివరి దశకు చేరుకున్నాయి. అక్కడ కొనుగోళ్లు పూర్తయితే అక్కడ పని చేస్తున్న కూలీలు బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు తరలివచ్చే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు బాగలేకపోవడంతో కూలీలు తొందరగా వస్తేనే ధాన్యం తూకం వేగంగా సాగుతుందని రైతులు చెబుతున్నారు.
మోర్తాడ్‌లోని కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కుప్పలు
వరి కోతలు పూర్తి చేసి ధాన్యంను కుప్పగా పోసి వారం అవుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. కానీ తూకం వేయడం లేదు. అదేమిటి అంటే కూలీలు రాలేరు అంటున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. తూకం వెంటనే వేయాలి.
– గోపిడి సత్యనారాయణ, రైతు, మోర్తాడ్
కూలీలను రప్పించాలని మధ్యవర్తిని కోరాం. కానీ బీహార్‌లో పండుగ ఉందని, అందుకే వారు రావడం ఆలస్యమవుతుందని చెబుతున్నారు. కూలీల సంఖ్య తక్కువగా ఉండటంతో అన్ని చోట్ల తూకం ప్రారంభించలేకపోతున్నాం. కూలీల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తున్నాం. రైతులు ఆందోళన చెందవద్దు.
– కాశీరాం, సీఈవో, మోర్తాడ్ పీఏసీఎస్


