ఎకో టూరిజం ఏర్పాట్లలో ముందడుగు..
● గాదేపల్లిలో కాటేజీలు, రిసార్ట్‌ల
డిజైన్ కోసం అర్కిటెక్చర్ పరిశీలన
● మ్యాప్ వచ్చిన వెంటనే పనులు మొదలు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఎకో టూరిజం ఏర్పాట్లలో కదలిక వచ్చింది. కాటేజీలు, రిసార్ట్‌లు, వాచ్ టవర్ల డిజైన్ కోసం అటవీ అధికారులు ఇటీవల అర్కిటెక్చర్‌ను పిలిపించారు. ఎకో టూరిజానికి కేంద్ర బిందువైన డొంకేశ్వర్ మండలం గాదేపల్లి శివారులో ఎస్సారెస్సీ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని వారు సందర్శించారు. అర్కిటెక్చర్ డిజైన్ తయారు చేసి ఇచ్చిన వెంటనే పనులు మొదలు పెట్టేందుకు ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం రూ.1.4కోట్ల వరకు నిధులు సైతం కేటాయించిన విషయం తెలిసిందే.
మూడు చోట్లలో గాదేపల్లినే ప్రధానం...
ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం 64 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు గుర్తించింది. జిల్లాలో డొంకేశ్వర్ మండలం గాదేపల్లి, నందిపేట్‌లో ఉమ్మెడ, బాల్కొండలో జలాల్‌పూర్‌ను ఎకో టూరిజం ప్రాంతాలుగా గుర్తించింది. అందులో పచ్చదనంతో విదేశీ పక్షులు, జింకలు సందడి ఎక్కువగా ఉండే గాదేపల్లి ప్రాంతాన్నే బాగా అభివృద్ధి చేయనున్నారు. తొలుత గాదేపల్లి వద్ద స్థల సేకరణకు ఇబ్బందులు ఏర్పడగా, ఇటీవల గ్రామస్తుల సహకారంతో వేరేచోట రెండెకరాల స్థలాన్ని గుర్తించారు. అటవీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అర్కిటెక్చర్‌తో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. డిజైన్ పూర్తయిన వెంటనే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.
పక్షం రోజుల్లో జిల్లాకు సఫారీ వాహనాలు..
ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించిన సందర్భంగా ప్రభుత్వం జిల్లాకు మూడు సఫారీ వాహనాలను కేటాయించింది. ఇందుకోసం రూ.45లక్షల నిధులను కూడా కేటాయించింది. ఒక్కో వాహనాన్ని రూ.15లక్షలు వెచ్చించి తయారు చేయిస్తున్నారు. ఇందుకోసం టెండర్లు పిలిచారు. ఇవి ఈ నెలాఖరుకు లేదా నవంబర్ మొదటి వారంలో జిల్లాకు వచ్చే అవకాశాలున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా ‘సాక్షి’కి తెలిపారు. గాదేపల్లి వద్ద ఎకో టూరిజం పనులు త్వరలో మొదలయ్యే అవకాశం ఉందన్నారు.


