ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి
● మీ మార్పు కుటుంబానికి,
సమాజానికి ఎంతో గర్వకారణం
● రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా
నిజామాబాద్‌అర్బన్: ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, వారిలోని మార్పు కుటుంబానికి, సమాజానికి ఎంతో గర్వకారణమని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా అన్నారు. జిల్లా జైల్లో సోమవారం తేనెటీగల పెంపకం, నివృత్తి డీ–అడిక్షన్ సెంటర్, ఫ్యూయల్ ఔట్‌లెట్ కార్యక్రమాలను ఆమె ప్రారంభించింది. ఈసందర్భంగా డీజీ మాట్లాడుతూ.. ఖైదీలకు ఉపాధి కల్పించడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఆర్థిక స్వావలంబన పెంపు లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఖైదీలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ వృత్తిని కొనసాగించవచ్చన్నారు. ప్రభుత్వం నుంచి సహాయం పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. జైళ్ల శాఖ ఐజీ ఎన్ మురళి బాబు మాట్లాడుతూ.. జిల్లా జైలు పరిధిలో మూడు కార్యక్రమాలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఫ్యూయల్ అవు ట్ లెట్, తేనెటీగల పెంపకం, నివృత్తి డీ–అడిక్షన్ సెంటర్ ఇవన్నీ ఖైదీల పునరవాసానికి మైలురాళ్లుగా నిలుస్తాయన్నారు. జైళ్ల శాఖ డీఐజీ సంపత్ మాట్లాడుతూ.. చర్లపల్లి, సంగారెడ్డి జిల్లాలో తేనెటీగల పెంపకం యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయని, మై నేషన్ బ్రాండ్ కింద తయారవుతున్న తేనెకు మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. సీపీ సాయిచైతన్య, సైకాలజిస్ట్ శ్రావ్య, ప్రకృతి ఎన్జీవో కల్పన, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, శ్రావణ్ కుమార్, వెంకట కార్తీక్, జైల్ సూపరింటెండెంట్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.


