రేపే ‘బాబ్లీ’ గేట్ల మూసివేత
● సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయనున్న త్రిసభ్య కమిటీ
● ఇన్‌ఫ్లో వస్తుండటంతో గేట్లను
మళ్లీ తెరిచే అవకాశం
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బుధవారం త్రిసభ్య కమిటీ సభ్యుల పర్యవేక్షణలో మూసివేయనున్నారు. కానీ ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది. దీనికితోడు ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో దిగువకు నీటి విడుదల చేపడుతున్నారు. కావున గేట్లను మూసివేసే అవకాశం లేదని ఎస్సారెస్పీ అధికారులు అంటున్నారు. సుప్రీం తీర్పును అమలు చేయాలి కాబట్టి త్రిసభ్య కమిటీ సభ్యులు బాబ్లీ ప్రాజెక్ట్‌కు చేరుకుని సంతకాలను చేయనున్నట్లు తెలిపారు. సంతకాలు చేయడంతో వరద తగ్గిన వెంటనే బాబ్లీ గేట్లను మూసివేసుకునే అవకాశం నాందేడ్ ఇరిగేషన్ అధికారులకు ఉంటుంది.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న..
సుప్రీం తీర్పు ప్రకారం బాబ్లీ గేట్లను ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న మూసి, జూలై 1న తెరవాలి. ఎస్సారెస్పీ ఎగువన గోదావరి పరివాహక ప్రాంతాల్లో నిలిచిన నీరుకు బదులుగా మార్చి 1న బాబ్లీ గేట్లు ఎత్తి 0.6 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీకి వదలాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది. అక్టోబర్ 28న అర్ధరాత్రి దాటకనే గేట్లను మూసివేయాలి. కానీ ఆ సమయంలో త్రిసభ్య సమిటీ సభ్యులు వెళ్లడం ఇబ్బందిగా ఉండటంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న ఉదయం గేట్లను మూసి వేస్తున్నారు. త్రిసభ్య కమిటీలో సభ్యులుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారులు, నాందెడ్ ఇరిగేషన్ అధికారులు, సీడబ్ల్యూసీ అధికారులు ఉన్నారు.
నీటి విడుదల కొనసాగుతుంది..
బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుంది. ప్రస్తుతం బాబ్లీ గేట్లు మూసి వేసే పరిస్థితి లేదు. కానీ సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలి. కాబట్టి త్రిసభ్య కమిటీ సభ్యులు బాబ్లీ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి గేట్లను మూసి వేస్తున్నట్లు సంతకాలు చేయడం జరుగుతుంది.
– చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ


