ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దు
● ఎంపీ అర్వింద్ ధర్మపురి
● కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి
పరామర్శ
సుభాష్‌నగర్: ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గన్‌కల్చర్ వంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించవద్దని ఎంపీ అర్వింద్ ధర్మపురి సూచించారు. అమరుడైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను సోమవారం నగరంలోని వారి నివాసంలో ఎంపీ అర్వింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణతో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.2లక్షల చెక్కును అందజేశారు. ఈసందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ ప్రమోద్‌పై రౌడీషీటర్ రియాజ్ కత్తితో దాడి చేసి హత్య చేయడం బాధాకరమన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులకే హైదరాబాద్ శివారులో గోరక్షక్ సోనుసింగ్‌పై తుపాకీతో కాల్పులు జరిపారని గుర్తుచేశారు. గత పదేళ్లలో దొంగ పాస్‌పోర్టులు, గన్‌కల్చర్ పెరిగిపోయిందని, ఓట్ల కోసం లాఅండ్ ఆర్డర్‌ను వాడుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు. రౌడీషీటర్ రియాజ్‌ను పట్టుకునే క్రమంలో గాయపడ్డ రాంనగర్‌కు చెందిన సయ్యద్ ఆసిఫ్‌ను తన నివాసంలో ఎంపీ అర్వింద్ ధర్మపురి, ఎమ్మెల్యే ధన్‌పాల్ పరామర్శించారు. రూ.50వేల చెక్కులను ఎంపీ, ఎమ్మెల్యే కలిసి అందజేశారు. నాయకులు న్యాలం రాజు, సుధా, బైకన్ మధు, తదితరులు ఉన్నారు.


