ఇసుక ట్రాక్టర్ల సీజ్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎలాంటి అనుమతులు లేకుండా లింగంపేట మండలం నుంచి నాగిరెడ్డిపేట మండలానికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను ఆదివారంరాత్రి పట్టుకొని సీజ్ చేసినట్లు స్థానిక ఎస్సై భార్గవ్‌గౌడ్ సోమవారం తెలిపారు. లింగంపేట మండలంలోని పర్మళ్లకు చెందిన రెండు ట్రాక్టర్లలో, శెట్పల్లి సంగారెడ్డికి చెందిన ఒక ట్రాక్టర్‌తోపాటు నాగిరెడ్డిపేట మండలంలోని పల్లెబోగుడతండాకు చెందిన ఒక ట్రాక్టర్‌లో ఇసుకను అక్రమంగా నాగిరెడ్డిపేట మండలంలోని జప్తిజాన్కంపల్లికి తరలిస్తుండగా పట్టుకున్నామని ఆయన చెప్పారు. ట్రాక్టర్లను సీజ్‌చేసి నాగిరెడ్డిపేట పీఎస్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముగ్గురిపై కేసునమోదు
కానిస్టేబుళ్ల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు వారిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేస్తామని బెదిరించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. లింగంపేట మండలంలోని పర్మళ్ల నుంచి ట్రాక్టర్‌లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న కానిస్టేబుళ్లు గంగారాం, సందీప్‌ను ఆదివారం రాత్రి పర్మళ్లకు చెందిన రమావత్ లింబ్యాతోపాటు అతని సోదరులు పరమేశ్, రమేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వాధికారుల విధులకు ఆటంకం కలిగించేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
రాజంపేట: మండలంలోని అన్నారం తండాలో వీధి కుక్కల దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. తండాకు చెందిన మాలోత్ దీప్లా, సంగీత, వినోద్, ధర్మిల పై కుక్కలు దాడి చేశాయి. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.


