‘ఉపాధి’లో పారదర్శకతకు ఈ–కేవైసీ
నెలాఖరు వరకు పూర్తి చేస్తాం
● ఈ నెల 31 చివరి తేదీ
● జిల్లాలో 75 శాతం పూర్తి
రెంజల్: గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పథకంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఈ–కేవైసీని అమలు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో వలసలను నివారించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహమీ పథకంలో జరుగుతున్న అక్రమాలను నివారించేందుకు సంస్కరణలను తీసుకు వస్తున్నా అవినీతి చోటు చేసుకుంటోంది. దీంతో కేంద్రం అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఈ–కేవైసీని అమలు చేస్తోంది. దీని కోసం జిల్లాలోని క్షేత్ర సహాయకులు కూలీల చిత్రాలను మొబైల్‌లో తీసి ఎన్‌ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానటరింగ్ సిస్టం) యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. క్రియాశీలకంగా పనిచేస్తున్న కూలీలను ఎంపిక చేసుకుని క్షేత్ర సహాయకులు ముమ్మరంగా గ్రామాల్లో దండోరా వేయించి ముందుకు సాగుతున్నారు. ఇది పూర్తయితే కూలీల హాజరు నమోదులో పారదర్శకత ఉంటుంది.
అక్రమాలు జరుగుతున్నాయిలా..
గ్రామాల్లో జరిగే ఉపాధి హామీ పథకంలో ఒకరికి బదులు మరొకరు హాజరు కావడం, గ్రామాల్లో లేని వారికి జాబ్‌కార్డులు జారీచేయడం, పనుల్లో ఎక్కువ మంది కూలీలు వచ్చినట్లు చూపడం, పనులకు రాని వారికి హాజరు వేసి క్షేత్ర సహాయకులు చెరిసగం పంచుకోవడం, బోగస్ మస్టర్లు తదితర అక్రమాలు సాగుతున్నాయి. సామాజిక తనిఖీల్లో బట్టబయలవుతున్నా చర్యలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ–కేవైసీ ఉంటేనే ఉపాధి పనులు కల్పించాలని నిర్ణయించింది. పనులకు రాకున్నా వారికి హాజరు వేయడంతో వచ్చిన వారికి తక్కువ మొత్తంలో గిట్టుబాటుకాని కూలీ రావడంతో అనేక సందర్భాల్లో కూలీలు రోడ్ల పై నిరసనలు వ్యక్తం చేశారు. నకిలీ హాజరుకు చెక్ పెట్టి పనులు చేసిన వారికే కూలీ సొమ్మును అందించేందుకు ఈ–కేవైసీతో అవకాశం ఉంటుంది.
జిల్లాలో ఈ–కేవైసీ వివరాలు
ఉపాధి కూలీలు ఈ–కేవైసీ
పూర్తయిన వారు
2,37,473 1,70,879
పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఈ–కేవైసీని ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తాం. ఇప్పటికే జిల్లాలో 75 శాతం పూర్తయింది. క్రియాశీలకంగా జిల్లాలో పని చేస్తున్న వారినే గుర్తించి ముందుకు సాగుతున్నాము. – సాయాగౌడ్, డీఆర్‌డీవో


