ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ అంకిత్
● ప్రజావాణిలో 104 దరఖాస్తుల స్వీకరణ
నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల స ముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 104 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌తో పాటు డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో సాయాగౌడ్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేసి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట పెన్షనర్లు నిరసన తెలిపారు. 2024 ఏప్రిల్ 1 నుంచి రిటైర్ అయిన పెన్షనర్లకు ఎలాంటి బెనిఫిట్స్ అందడం లేదన్నారు. జీపీఎఫ్ బిల్లులు అందించాలని, ఏరియల్స్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సుఖుమ్, శ్రీధర్, బన్సీలాల్ రాజేందర్, శంకర్ గౌడ్, పూర్ణచంద్రారావు, హనుమాండ్లు, కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగుల నాయకులు పాల్గొన్నారు,
సెల్ టవర్ పనులను నిలిపివేయండి
ముబారక్‌నగర్ ఏకశిలానగర్‌లోని నివాస ప్రాంతాల్లో చేపడుతున్న సెల్ టవర్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని దీని వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్థానికులకు తెలియకుండా గుత్తేదారు ఇళ్ల మధ్య టవర్ నిర్మాణం చేపడుతున్నారని తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి
ఇటీవల తుఫాన్‌వల్ల కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడిసిపోయిందని వాటిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆర్‌ఎస్‌పీ పార్టీనగర కన్వీనర్ రాములు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
పోలీస్ ప్రజావాణిలో 11 ఫిర్యాదులు..
నిజామాబాద్‌అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 11 ఫిర్యాదులను సీపీ సాయి చైతన్య స్వీకరించారు. ఫిర్యాదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలన్నారు.
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి


