మార్గం సుగమం..!
● ‘స్థానిక’ ఎన్నికల్లో సంతానం నిబంధన ఎత్తివేతకు మంత్రివర్గ ఆమోదం
● పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు
● ఆయా స్థానాల్లో పెరగనున్న పోటీ
మోర్తాడ్(బాల్కొండ): పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉండొద్దనే నిబంధన ఎత్తివేతకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపడంతో ఆశావహుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేవారికి పరిమితి సంతానం నిబంధనను గత ప్రభుత్వం ఎత్తివేసింది. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో మాత్రం అదే నిబంధన అమలులో ఉండటంతో అనేక మంది ఔత్సాహికులు పోటీకి దూరమయ్యారు.
జనాభా నియంత్రణ కోసం..
జనాభా నియంత్రణలో భాగంగా 1995లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండరాదనే నిబంధన అమలులోకి తీసుకొచ్చింది. 1995 జూన్ 1 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా అప్పటి ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో 1995 జూన్ తర్వాత జరిగిన అన్ని స్థానిక సంస్థల, సహకార సంఘాల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు పోటీకి దూరమయ్యారు. తాజాగా ఆ నిబంధన ఎత్తివేయడం ఔత్సాహికులకు ఎంతో ఊరట కలిగించే విషయం.
పెరగనున్న పోటీ..
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తే 545 సర్పంచ్ పదవులు, 5,022 వార్డు సభ్యుల స్థానాలు, 307 ఎంపీటీసీ, 31 జడ్పీటీసీ స్థానాలకు చాలా మంది పోటీ చేసే అవకాశం ఉంది. గతంలో పరిమిత సంతానం నిబంధనతో పోటీ తగ్గగా ఈసారి నిబంధన ఎత్తివేయడంతో స్థానికల్లో పోటీ పెరిగే అవకాశం ఉంది. చాలాకాలంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారిలో ఉత్సాహం నెలకొంది.


