కుండీల్లోనే ముగిసిన కథ!
● వంద రోజులు దాటినా పంపిణీకి నోచుకోని చేపపిల్లలు
● ఎన్ని బతికున్నాయో చెప్పలేమంటున్న అధికారులు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తి చేసిన చేపపిల్లల పంపిణీ కథ కంచికే అన్నట్లుగా తయారైంది. చేపపిల్లలను ఉత్పత్తి చేసి వంద రోజులు దాటినా ఇప్పటి వరకు పంపిణీపై ఎలాంటి నిర్ణయం లేదు. ఈ ఏడాది కేవలం 54 లక్షల చేపపిల్లలను మాత్రమే ఉత్పత్తి చేసి కుండీల్లో నిల్వ ఉంచారు. అయితే, 20 రోజుల క్రితం కుండీల్లోని చేపపిల్లలు సగం మృత్యువాత పడినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్ని చేపపిల్లలు ఉన్నాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని అధికారులు చెపుతున్నారు. కుండీల్లో ఫంగస్ వచ్చి చనిపోయి ఉంటాయనే అనుమానం వ్య క్తం చేస్తున్నారు. సరైన సమయంలో పంపిణీ చేయకపోవడంతో ప్రభుత్వ సొమ్ము వృథాగానే పోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిక
చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుతం ఉత్పత్తి చేసిన చేపపిల్లల వయస్సు 100 రోజులు దాటింది. ఇప్పటి వరకు ఎన్ని ప్రాణంతో ఉన్నాయో చెప్పలేం. 54 లక్షల చేపపిల్లలను ఉత్పత్తి చేశాం. ప్రస్తుతం చేపపిల్లలను పంపిణీ చేసినా ప్రయోజనం ఉండదు. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిపాం.
– దామోదర్, మత్స్యఅభివృద్ధి అధికారి,
శ్రీరాంసాగర్


