ప్రకృతి సేద్యంతోనే ఆరోగ్య భాగ్యం
బోధన్: ప్రకృతి సేద్యంతోనే సంపూర్ణ ఆరోగ్య భాగ్యం లభిస్తుందని ఆదర్శ రైతు కరుటూరి పాపారావు, పలువురు వక్తలు అన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఆదివారం పాపారావు తన సూర్యోదయ సహజ వ్యవసాయ క్షేత్రంలో సహజ వ్యవసాయ సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా పాపారావు మాట్లాడుతూ.. సేంద్రియ ఎరువులతో పండించిన ఆహార ఉత్పత్తుల ప్రాముఖ్యతను అవగాహన కల్పించేందుకు ప్రతిఏటా కార్తీక మాసంలో రైతులు, వినియోగదారులకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తనకు వ్యాపార దృక్పథం లేదని, ఆరోగ్యమైన, నాణ్యమైన ఆహార ఉత్పత్తులపై అందరికి అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాన్నారు. అలాగే పశుసంవర్ధక శాఖ విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ రెడ్డి, ఆత్మా జిల్లా విశ్రాంత పీడీ రవీందర్, నందిపేట ఎంపీడీవో శ్రీనివాస్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ రాంగోపాల్ రెడ్డి, రైతు విఠల్‌రెడ్డి, ప్రసాద్‌తోపాలు పలువురు వక్తలు తమ అభిప్రాయాలను సదస్సులో వివరించారు. గోకృపామృతం, జీవామృతం సేంద్రియ ఎరువులు, వివిధ కషాయాలతో చేసే ప్రకృతి వ్యవసాయ సాగుపై రైతులు దృష్టిపెట్టాలన్నారు. పాపారావు ప్రకృతి వ్యవసాయం చేస్తు అందరికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. అంతకుముందు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లోని వివిధ మండలాల నుంచి ప్రకృతి ప్రేమికులు, సేంద్రియ వ్యవసాయ సాగుదారులు, వినియోగదారులు అధిక సంఖ్యలో హాజరై, పాపారావు వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించారు.
ప్రకృతి సేద్యంతోనే ఆరోగ్య భాగ్యం


