దరఖాస్తుల ఆహ్వానం
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్ధ (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకులకు స్వయం ఉపాధి కోర్సులలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 3న సీసీ టీవీ ఇన్‌స్టాలేషన్ (13రోజులు), వెజిటబుల్ నర్సరీ (35రోజులు), పాపడ్, ఊరగాయల తయారీ (10 రోజులు), తేనెటీగల పెంపకం (20 రోజులు), పుట్టగొడుగుల పెంపకం (10 రోజులు), నవంబర్ 17న మగ్గం వర్క్ (31రోజులు), నవంబర్ 18న (టైలరింగ్ (31రోజులు), నవంబర్ 19న బ్యూటీపార్లర్ (35రోజులు) కోర్సుల్లో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజన, హాస్టల్ సదుపాయం ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రం అందిస్తామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని 19–45 సంవత్సరాల వయస్సు కలిగిన గ్రామీణ ప్రాంత యువతీయువకులు దరఖాస్తులకు అర్హులన్నారు. ఆసక్తిగల వారు తమ ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, 10వ తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, బ్యాంకు ఖాతా జిరాక్స్ వెంట తెచ్చుకుని నేటినుంచి పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం డిచ్‌పల్లిలోని ఎస్‌బీఐ శిక్షణ కేంద్రంలో లేదా 08461–295428 నెంబరును సంప్రదించాలని ఆయన సూచించారు.
ఆర్మూర్‌టౌన్: బీజేపీ కార్యాకర్తలు, నాయకులు పార్టీ అభివృద్ధి కోసం కృషిచేయాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లెగంగారెడ్డి అన్నారు. ఆర్మూర్‌లోని 16వ వార్డులో ఆదివారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి పీఎం మన్‌కీబాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగురవేయ్యాలన్నారు. నాయకుడు భూపతిరెడ్డి, కంచెట్టి గంగాధర్, మందుల బాలు, సుంకరి రంగన్న, కలిగొట ప్రశాంత్, ఉదయ్‌గౌడ్ పాల్గొన్నారు.
మాచారెడ్డి: పాల్వంచ మండలం ఫరీద్‌పేట శివారులో ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ శివారులోని పత్తి చేనులో పనిచేస్తున్న 45 సంవత్సరాల మహిళపై ఆదివారం సాయంత్రం బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కూలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు తీవ్ర రక్తస్రావమై, అస్వస్థతకు గురికావడంతో స్థానికులు గుర్తించి, చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


