
ఇందిరమ్మ ఇళ్లకు ఐకేపీ రుణం
డొంకేశ్వర్(ఆర్మూర్) : ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోలేని స్థితిలో ఉన్న లబ్ధిదారులకు గ్రామీణాభివృద్ధి శాఖ రుణాలందించి ప్రోత్సహిస్తోంది. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి పథకాల ద్వారా కావాల్సినంత రుణం ఇచ్చి మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తోంది. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లను వారు ధైర్యంగా నిర్మించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతిళ్లు కల నెరవేర్చాలనే లక్ష్యంతో అర్హులను గుర్తించింది. ఇందులో మహిళలనే లబ్ధిదారులుగా చేసింది. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మేరకు ఇళ్లు నిర్మించుకునే వారికి రూ.5 లక్షలు విడతల వారీగా ఇస్తామని చెప్పడంతో చేతిలో డబ్బులున్న కొంతమంది నిర్మాణ పనులను ప్రారంభించారు. అయితే చేతిలో డబ్బుల్లేక చాలామంది ముగ్గు కూడా పోయడానికి ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు లబ్ధిదారులకు ఐకేపీ ద్వారా రుణాలు అందించాలని అధికారులకు సూచించింది. లబ్ధిదారుల్లో 99శాతం మంది మహిళా సంఘంలో సభ్యులుగా ఉన్నారు. వీరికి బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు తీసుకునేలా మహిళలకు అవగాహన కల్పించి ప్రోత్సహించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,927 మంది లబ్ధిదారులకు రూ.21.82 కోట్లకు పైగా రుణాలను అందజేసి ఇళ్ల నిర్మాణాలకు తోడ్పాటును అందించారు. రూ.50 వేల నుంచి రూ.3 లక్షల దాకా రుణాలు ఇచ్చారు. అత్యధికంగా సిరికొండలో 113 మందికి, కమ్మర్‌పల్లిలో 116 మందికి, నందిపేట్, ముప్కాల్, ఎడపల్లి, సిరికొండ, వేల్పూర్ మండలాల్లో కూడా వంద మందికి పైగానే రుణాలిచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు రుణాలివ్వడంతో బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి లక్ష్యాల సాధన కూడా తమకు సులభం అవుతోందని అధికారులు పేర్కొంటున్నారు.
నియోజకవర్గం లబ్ధిదారులు పొందిన
రుణాలు
ఆర్మూర్ 346 3.77
బాల్కొండ 490 4.83
బాన్సువాడ 192 2.10
బోధన్ 370 4.76
నిజామాబాద్‌రూరల్ 529 6.36
మొత్తం 1,927 21.82
నియోజకవర్గాల వారీగా
అందించిన రుణాలు (కోట్లలో)
బ్యాంకు లింకేజీ ద్వారా
ఆర్థిక తోడ్పాటు
జిల్లాలో 1,927మందికి
రుణాలు మంజూరు

ఇందిరమ్మ ఇళ్లకు ఐకేపీ రుణం