
వెలవెలబోతున్న వాగులు
ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో వాగులు, వొర్రెలు నీరు లేక వెలవెలబోతున్నాయి. చెరువులలోనూ నీరు లేక సాగునీటిని అందించని దుస్థితి ఏర్పడింది. మే నెలలో వర్షాలు కురిసినా వేసవి తీవ్రతకు ఆ నీరు భూమిలో ఇంకలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వర్షాకాలం ఆరంభమై 45 రోజులు గడచినా భారీ వర్షపాతం నమోదు కాకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి తక్కువ వర్షాలే కురిశాయని తెలుస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సరైన ఇన్‌ఫ్లో లేకపోవడంతో నీటి విడుదల షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. షెడ్యూల్ ఖరారు చేసి ఉంటే లక్ష్మి కాలువ ద్వారా నీటి విడుదల జరిగేది. వేంపల్లి, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకాలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఏర్పడేది.