
సాటిలేని మహాకవి దాశరథి
నిజామాబాద్ రూరల్: ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి మాట జిల్లా జైలు గోడలు దాటి బయటి ప్రపంచాన్ని చైతన్యపరిచి విశ్వవ్యాప్తమైందని, ఆయన సాటిలేని మహాకవి అని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల అన్నారు. నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన దాశరథి శతజయంత్యుత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో మహాకవి దాశరథి నిజాం నిరంకుశానికి ఎదురోడి పోరాటం చేశారన్నారు. తాళం, గానంతో ప్రజల గుండెలను చైతన్యపరిచే వాడే నిజమైన కవి అని అన్నారు. కవులు ఎప్పుడూ ప్రజల కన్నీళ్లు తుడిచేలా ఉండాలన్నారు. తెలంగాణ యుద్ధనౌక, తన తండ్రి అయిన గద్దర్‌కు ఇచ్చిన మాట కోసం తాను సమసమాజ స్థాపన, ఓటు హక్కు విప్లవం కోసం అంతర్గతంగా పోరాడతానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కవులు, కళాకారులకు పేరు, ప్రతిష్టలు వచ్చాయన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని అందులో సామాజిక న్యాయం అనే పదం లేకుండా కొన్ని రాజకీయ శక్తులు చూస్తున్నాయని, దీనికోసం తాను నిశబ్ధ విప్లవం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ మలి దశ ఉద్యమంలో పనిచేసిన వారికి ఉద్యోగాలు ఇప్పించాలని కళాకారులు చైర్‌పర్సన్ వెన్నెలకు వినతిపత్రం అందజేశారు. దాశరథి జిల్లా అవార్డును ప్రముఖ కవి బీఎంబీకి అందజేశారు. వెన్నెలను డాక్టర్ కవితారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత సన్మానించారు. చివరగా వెన్నెల పాడిన విప్లవ గీతం ఆహుతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో డీఈవో అశోక్, ప్రొఫెసర్ కనకయ్య, హెచ్‌ఎం సీతయ్య, కమిటీ సభ్యులు సిర్ప లింగం, కోనేరు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయం కోసం
కవులు పోరాడాలి
తెలంగాణ సాంస్కృతిక సారథి
చైర్‌పర్సన్ వెన్నెల

సాటిలేని మహాకవి దాశరథి

సాటిలేని మహాకవి దాశరథి