
అప్పుల బాధతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
డిచ్‌పల్లి: మండలంలోని వెస్లీనగర్ తండాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ రాథోడ్ రమేశ్ కుమార్ (46) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ ఆర్టీసీ డిపో–1లో రమేశ్‌కుమార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య సరోజ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆదివారం సరోజ తీజ్ పండుగ కోసం తల్లిగారి ఊరు యాచారం తండాకు వెళ్లింది. రాత్రి భోజనం చేసిన తర్వాత రమేశ్ బెడ్ రూం కు వెళ్లి నిద్రపోయాడు. సోమవారం ఉదయం 8 గంటలైనా కొడుకు బయటకు రాకపోవడంతో తల్లి కమల వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు తండాకు చేరుకుని వివరాలు సేకరించారు. తన ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేయడం, పొలంలో నీళ్ల కోసం ఐదు బోర్లు వేయగా అవి ఫెయిల్ కావడంతో సుమారు రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పుల బాధతో మనస్తాపానికి గురైన రమేశ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో మరొకరు..
కామారెడ్డి క్రైం: ఆర్థిక ఇబ్బందులతో ఒకరు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ సోమవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రాజంపేటకు చెందిన గొడుగు సుధాకర్(30) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. వ్యవసాయం, కుటుంబ అవసరాలకు కొంత కాలంగా చేసిన అప్పులు పెరిగాయి. దీంతో మనస్థాపంతో ఆదివారం సాయంత్రం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.