
దారిదోపిడీకి పాల్పడిన నిందితుల అరెస్ట్
కామారెడ్డి క్రైం: బైక్‌పై ఇంటికి వెళ్తున్న ఓ వక్తిని లిఫ్ట్ అడిగి దారి దోపిడీకి పాల్పడిన కేసులో నిందితులను పోలీసులు సోమవారం పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి ఏఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. దోమకొండ మండలం చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన సార్ల చిన్న గంగయ్య శుక్రవారం సాయంత్రం వ్యక్తిగత పనులపై కామారెడ్డికి వచ్చాడు. ఓ కల్లు దుకాణంలో కల్లు సేవించిన సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ అతనితో మాటలు కలిపి చింతమాన్‌పల్లి వెళ్లే దారిలో క్యాసంపల్లి వరకు తనకు లిఫ్ట్ ఇవ్వమని అడిగింది. చిన్న గంగయ్య సరేనని ఆమెను బైక్‌పై ఎక్కించుకుని పట్టణ శివారు దాటగానే ఓ చోట బైక్ ఆపమని అడిగింది. వెంటనే ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చి గంగయ్యను బెదిరించి అతని వద్ద ఉన్న రూ.28 వేలు లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఆధారాలతో నిందితులను పట్టణంలోని షబ్బీర్ అలీ కాలనీలో నివాసం ఉండే కడమంచి లక్ష్మి, షేక్ జావేద్, షేక్ అబ్బు లుగా గుర్తించారు. సోమవారం వారిని ఓ కాలనీ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితులు గతంలోనూ మేడ్చల్, దేవునిపల్లి, తదితర పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఇలాంటి దారి దోపిడీ ఘటనలకు పాల్పడినట్లు పలు కేసులు ఉన్నాయని వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నామని అన్నారు. కేసు చేధనలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు ఉస్మాన్, వినయ్ సాగర్, సిబ్బంది రాజేందర్, గణపతి, నరేశ్, రాజు, భాస్కర్, కిషన్, శ్రావణ్, కమలాకర్ మైసయ్య లను ఏఎస్సీ అభినందించారు.