
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
● సిరికొండలో ఆకస్మిక తనిఖీలు
సిరికొండ: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి వైద్య సిబ్బందిని ఆదేశించారు. సిరికొండ మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ హాజరుపట్టిక ప్రకారం వైద్యాధికారి, సిబ్బంది విధుల్లో ఉన్నారా లేదా అని పరిశీలించారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని, గ్రామాలలో విరివిగా వైద్య శిబిరాలను ఏర్పాటు చే యాలన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం కోసం వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. మౌలిక వసతులు అవసరమైతే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ప్రతిపాదనలు పంపాలని ఎంఈవో రాములు, హెచ్‌ఎంలు సతీశ్, నరేశ్‌లకు సూచించా రు. పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు వచ్చా యా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ తోడ్పాటుతో విద్యార్థులకు ఐడీ కార్డులు, క్రీడా దుస్తులు సమకూర్చడంపై కలెక్టర్ అభినందించారు. తహసీల్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తులపై ఆరా తీశారు. రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని నిర్ణీత గడువులోగా అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. కొత్త రేషన్‌కార్డులు, పేర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిశీలించి అర్హులకు ఆమోదం తెలపాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కింద నిర్ణీత రుసుము చెల్లించిన దరఖాస్తుదారులకు సత్వరమే ప్రొసీడింగ్స్ అందించాలన్నారు. పీఏసీఎస్ గోదామును తనిఖీ చేసి ఎరువులను పరిశీలించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలె క్టర్ పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో మనోహర్‌రెడ్డి, తహసీల్దార్ రవీందర్‌రావు ఉన్నారు.