
కరుణించవా.. వరుణదేవా
మోర్తాడ్(బాల్కొండ): ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నా.. వర్షం కురిపించడంలో వరుణదేవుడు దోబుచులాడుతున్నాడు. చినుకు జాడ లేక పంట భూములు తడారి పోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుణుడి కరుణ కోసం వివిధ గ్రామాలలో ప్రజలు గ్రామ దేవతలు, ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేవతా విగ్రహాలకు జలాభిషేకం చేస్తున్నారు. మరోవైపు జూన్ నెల నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 299 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 222 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 25 శాతం వర్షపాతం లోటు ఉందని వాతావరణ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
ఇంకిపోతున్న బోరుబావులు
వర్షాలు సమృద్ధిగా కురువకపోవడంతో భూగర్భ జ లాలు ఇంకిపోతున్నాయి. ఫలితంగా బోరుబావుల నుంచి గతంలో మాదిరి నీరు రావడం లేదు. చాలా చోట్ల కొత్త బోరుబావులు తవ్వించే పరిస్థితి ఉంది. అల్పపీడనం వంటిది ఏర్పడితే తప్ప భారీ వర్షాలకు అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
4.59లక్షల ఎకరాల్లో సాగు
వాతావరణం అనుకూలంగా ఉంటుందనే నమ్మకంతో రైతులు జిల్లా వ్యాప్తంగా 4,59,865 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఇందులో వరి 3.26లక్షలు, మొక్కజొన్న 47వేలు, సోయా 32వేలు, పసుపు 23వేల ఎకరాల్లో సాగు అవుతుంది. ఆయిల్‌పాం 11వందల ఎకరాలు, ఇతర రకాల పంటలు 30వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. గత సీజన్ కంటే ఈసారి వరి సాగు విస్తీర్ణం 79వేల ఎకరాలు పెరిగింది. ముందస్తు వర్షాలు కురువడంతో వరి సాగుకు ఆసక్తి చూపిన రైతులు.. ప్రస్తుతం వర్షాలు లేక ఆకాశం వైపు చూస్తున్నారు.
మురిపిస్తున్న మేఘాలు..
కురవని వర్షాలు
సాగునీటి కోసం
రైతుల ఇబ్బందులు
పంటల రక్షణకు తంటాలు
వర్షాల కోసం ఆలయాల్లో పూజలు

కరుణించవా.. వరుణదేవా