
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
● డీఎంహెచ్‌వో రాజశ్రీ
మోపాల్(నిజామాబాద్‌రూరల్) : ప్రజలు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ సూచించారు. మండలంలోని కాల్పోల్ గ్రామాన్ని ఆదివారం ఆమె సందర్శించారు. డెంగీ కేసులు నమోదైన నేపథ్యంలో రెండో రోజు కొనసాగుతున్న వైద్యశిబిరాన్ని పరిశీలించారు. ప్రజల ఆరోగ్యం కుదుటపడే వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని ఆమె తెలిపారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించాల్సిన జాగ్రత్తలను ప్రజలకు సూచించారు. దోమల లార్వా నిర్మూలనకు మందులను పిచికారీ చేయాలని, డ్రై డే పాటించాలని పంచాయతీ, వైద్య సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలో మురుగు కాల్వలు శుభ్రంగా ఉంచాలని, గుంతలను పూడ్చేయాలని సూచించారు. డీఎంహెచ్‌వో వెంట డీఎల్‌పీవో శ్రీనివాస్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, ఎంపీవో కిరణ్‌కుమార్, వైద్యాధికారులు నాగరాజు, వెంకటేశ్, ప్రత్యూష, అజ్మల్ తదితరులు ఉన్నారు.
ధాన్యం డబ్బుల కోసం రైతుల తిప్పలు
● వడ్ల వ్యాపారులపై కేసు నమోదు
బోధన్‌రూరల్: దళారులను నమ్మి ధాన్యం అమ్మిన రైతులు డబ్బులు అందక తిప్పలు పడుతున్నారు. గత యాసంగి సీజన్‌లో బోధన్ మండలం రాంపూర్, కల్దుర్కి, బండర్‌పల్లి, మావందికుర్దు, మావందికలాన్, సాలూర మండలం జాడిజమాల్‌పూర్ గ్రామాలకు చెందిన పలువురు రైతులు దళారుల ద్వారా నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారులు గౌర రాజేశ్, గౌర వెంకటేశ్వర్లుకు ధాన్యం విక్రయించారు. మొత్తం రూ.6.80 కోట్ల విలువజేసే ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు రైతులకు మొదట రూ.5.20 కోట్లు చెల్లించారు. మిగతా రూ.1.60 కోట్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు చెల్లించకపోవడంతో రాంపూర్ గ్రామానికి చెందిన దేవదాస్ అనే రైతు బోధన్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అటవీ భూమి చదును చేసిన
17 మందిపై కేసు
నిజామాబాద్ రూరల్: అటవీ భూమిని చదును చేసిన 17 మందిపై కేసులు నమోదు చేసినట్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో మహ్మద్ ఆరీఫ్ ఆదివారం తెలిపారు. మల్కాపూర్ తండా శివారులో శనివారం అటవీ భూమిని చదును చేసిన వారిపై కేసులు నమోదయ్యాయన్నారు. అటవీ ప్రాంతంలో ట్రాక్టర్ సహాయంతో 8 ఎకరాల భూమిని అక్రమంగా చదును చేస్తున్న విషయం తెలుసుకొని అటవీ సెక్షన్ అధికారి బాషిద్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారని, అటవీ భూమిని చదును చేస్తున్న 17 మందిని పట్టుకొని స్టేషన్‌లో అప్పగించారన్నారు. అటవీ సంపదను కొల్లగొడితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌హెచ్‌వో హెచ్చరించారు.