కూల్చిందెవరు? | - | Sakshi
Sakshi News home page

కూల్చిందెవరు?

Jul 21 2025 6:05 AM | Updated on Jul 21 2025 6:07 AM

నేలమట్టమైన స్వచ్ఛభారత్‌ మరుగుదొడ్లు

ఖలీల్‌వాడి: స్వచ్ఛభారత్‌ లక్ష్యం జిల్లా కేంద్రంలోనే నీరుగారుతోంది. బహిరంగ మల విసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నగరంలోని పలుచోట్ల సామూహిక మరుగుదొడ్లను నిర్మించారు. అయితే నిజామాబాద్‌ నగరంలోని పాములబస్తీలో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను కొందరు వ్యక్తులు కూల్చివేశారు. ఇదేమిటని స్థానికులు ప్రశ్నిస్తే మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి సరైన సమాధానం రావడం లేదు. కానీ స్థానికుల సౌకర్యార్థమని ప్రతిరోజూ మొబైల్‌ టాయిలెట్‌ను తీసుకొచ్చి నిలుపుతున్నారు. సామూహిక మరుగుదొడ్లను అసలు ఎందుకు కూల్చివేశారో అర్థం కావడం లేదని కొందరు వాపోతుండగా, స్థానికంగా ఓ కార్పొరేట్‌ కళాశాల ఏర్పాటు కానుండడమే కూల్చివేతకు కారణమని మరికొందరు ఆరోపిస్తున్నారు.

స్వచ్ఛభారత్‌ ద్వారా కేటాయించిన నిధులతో నిజామాబాద్‌ నగరంలో సామూహిక మరుగుదొడ్లను నిర్మించారు. పాములబస్తీలో 90 నుంచి 100 కుటుంబాలకు చెందిన సుమారు 300 మందికి ఈ సామూహిక మరుగుదొడ్లే దిక్కు. సామూహిక మరుగుదొడ్లు నిర్మించిన తరువాత ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ చాలా వరకు మెరుగుపడిందని అంతా అనుకున్నారు. కానీ ఇటీవల సామూహిక మరుగుదొడ్లను కొందరు వ్యక్తులు కూల్చివేశారు. వాటిని మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల అనుమతితో కూల్చారా లేక ప్రైవేట్‌ వ్యక్తుల పనా అనేది తేలలేదు. నాటి నుంచి స్థానికులు మలవిసర్జనకు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. దీనిపై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల వద్దకు వెళ్లి తాము ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేసి మొబైల్‌ టాయిలెట్‌ తీసుకువచ్చి జిల్లా పరిషత్‌ వద్ద మెయిన్‌రోడ్డుపై నిలుపుతున్నారని స్థానికులు అంటున్నారు. మహిళలు, ఆడ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు మొబైల్‌ టాయిలెట్‌ ఉంటోందని, సాయంత్రం తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో అధికారులకే అర్థం కావాలని అంటున్నారు.

ఆ రోజుల్లో మొబైల్‌ టాయిలెట్‌ కనిపించదు

జిల్లా కేంద్రం కావడంతో నగరానికి వీఐపీల రాకపోకలు, పెద్ద కార్యక్రమాల నిర్వహణ మామూలే. దీంతో మొబైల్‌ టాయిల్‌ వాహనాన్ని కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. ఆ రోజు ల్లో పాములబస్తీవాసులకు మొబైల్‌ టాయిలెట్‌ వాహనం అందుబాటులో ఉండడం లేదు.

మరుగుదొడ్లను నిర్మించాలి

ప్రైవేట్‌ కాలేజీ కోసం భవనం నిర్మిస్తున్న వారిని మ రుగుదొడ్లను కూల్చివేతపై నిలదీస్తే మొబైల్‌ టాయిలెట్‌ వస్తోంది కదా అని అంటున్నారు. కొన్ని సంద ర్భాల్లో మొబైల్‌ టాయిలైట్‌ వాహనం రాకపోవడంతో మహిళలు, యువతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో సామూహిక మరుగుదొడ్లను య థావిధిగా నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – లక్ష్మణ్‌సింగ్‌, పాములబస్తీ

కలెక్టర్‌ చొరవ చూపాలి

స్వచ్ఛ భారత్‌ మరుగుదొడ్లను కాలనీవాసులందరం ఉపయోగించుకునేవారిమి. వాటిని కూల్చివేయడంతో ఇబ్బందిగా మారింది. మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్‌ అధికారులు, నాయకులను కలిసినా ఎవరూ స్పందించడం లేదు. కలెక్టర్‌ స్పందించి సామూహిక మరుగుదొడ్లు నిర్మించేలా కృషి చేయాలి.

– మహేందర్‌సింగ్‌, పాములబస్తీ

ఆ కార్పొరేట్‌ కళాశాల కోసమేనా?

ఓ కార్పొరేట్‌ కళాశాల కోసం భవన నిర్మాణ పనులు పాములబస్తీలో కొనసాగుతున్నాయి. అయితే భవన నిర్మాణం కొనసాగుతున్న ప్రాంతంలోనే సామూహిక మరుగుదొడ్లు ఉండడంతో వాటిని కూల్చివేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరుగుదొడ్లను కూలుస్తున్న సమయంలో స్థానికులు కొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో మున్సిపల్‌ అధికారులు, వివిధ పార్టీల నాయకుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. కళాశాల కోసం నిర్మిస్తున్న భవనం వద్దకు కాలనీ వాసులు వెళ్లి నిలదీశారు.

జిల్లా కేంద్రంలోని పాములబస్తీలో సామూహిక మరుగుదొడ్లు నేలమట్టం

మహిళలు, యువతులకు ఆత్మగౌరవం అందించడం ఇలాగేనా..?

నీరుగారుతున్న స్వచ్ఛ భారత్‌ లక్ష్యం

కార్పొరేట్‌ కాలేజీ కోసమేనని

స్థానికుల ఆరోపణ

తీవ్ర ఇబ్బందులు పడుతున్న

సుమారు 300 మంది

పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు

తాత్కాలికంగా మొబైల్‌

టాయిలెట్‌ ఏర్పాటు

కూల్చిందెవరు?1
1/2

కూల్చిందెవరు?

కూల్చిందెవరు?2
2/2

కూల్చిందెవరు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement