
బడిబాటలో ‘ప్రత్యేక’ పిల్లల గుర్తింపు
ఆర్మూర్: బడి బాటలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు కోసం విద్యాశాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు. సమాజంలో నిరాదరణకు గురవుతున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లల (దివ్యాంగులు)ను బడుల్లో చేర్పించి, సాధారణ విద్యార్థులతో సమానంగా విద్యాబుద్ధులు నేర్పించడానికి విద్యాశాఖ, తెలంగాణ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం సంయుక్తంగా ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర స్థాయి అధికారులు ఇచ్చిన సూచనల మేరకు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యా హక్కును పూర్తిస్థాయిలో వారికి అందేలా అమలు చేయనున్నారు. అందుకు ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ‘పాఠశాల సంసిద్ధత’ కార్యక్రమాన్ని అధికారులు సూచించిన ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తున్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారిని బడిలో చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇంటింటికీ ప్రచారం..
విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి సాధారణ విద్యార్థులతో పాటు ప్రత్యేక అవసరాలు గల పిల్లలను పాఠశాలల్లో చేర్పించుకోవడానికి పాఠశాల సంసిద్దత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాల మేరకు జిల్లా అధికారులు క్షేత్ర స్థాయిలో కార్యాచరణను అమలు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్పీ)ల సహకారంతో ముందుకు సాగుతున్నారు. గ్రామాలలో సర్వేల ఆధారంగా గుర్తించిన ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, ప్రతీ మండలంలో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్చుతున్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ బడి బయటి ప్రత్యేక అవసరాలు గల పిల్లల ఇళ్లను సందర్శించి బడుల్లో చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ‘పాఠశాల సంసిద్ధత’ కార్యక్రమం
ప్రతీ మండలంలో
ఒక భవిత కేంద్రం ఏర్పాటు
ఎంఈవోలు, ఐఈఆర్పీలకు ఉన్నతాధికారుల ప్రత్యేక సూచనలు
సేవాభావంతో..
ప్రత్యేక అవసరాలు గల పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తూ ఐఈర్పీలు నిర్వహిస్తున్న బాధ్యతలు డ్యూటీగా కాకుండా సేవగా గుర్తిస్తారు. సేవా భావంతో పని చేస్తూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పాఠశాల సంసిద్దత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. – శ్రీనివాస్‌రావు, సెక్టోరల్ ఆఫీసర్,
సమగ్ర శిక్ష, నిజామాబాద్
ప్రత్యేక శ్రద్ధ చూపించాలి..
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు శిక్షణనిస్తూ పాఠశాలల్లో చేర్పించే విషయంలో ఐఈర్పీలతో పాటు ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. బడిబాట కార్యక్రమంలో భాగంగా బడి బయట పిల్లలు ఉండకుండా పక్కా ప్రణాళిక ప్రకారం వారిని బడిలో చేర్పించాలి.
– అశోక్, డీఈవో, నిజామాబాద్

బడిబాటలో ‘ప్రత్యేక’ పిల్లల గుర్తింపు

బడిబాటలో ‘ప్రత్యేక’ పిల్లల గుర్తింపు

బడిబాటలో ‘ప్రత్యేక’ పిల్లల గుర్తింపు