● పల్లెల్లో మితిమీరుతున్న
మైక్రో ఫైనాన్స్ ఆగడాలు
● తీవ్ర ఆందోళన చెందుతున్న బాధితులు
రామారెడ్డి: పల్లెల్లో మళ్లీ మైక్రో ఫైనాన్స్ సంస్థలు మహిళలు, చిరు వ్యాపారులకు రుణాలు ఇస్తూ వారిని నిండా ముంచుతున్నారు. ప్రజల అత్యవసరాన్ని ఆసరా చేసుకొని అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి తీరా ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే వేధింపులకు గురిచేస్తున్నారు. గతంలో మైక్రో ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు జిల్లాలో ఉన్నాయి. అప్పట్లో ప్రభుత్వం వీటిని నిషేధించింది. కానీ మళ్లీ గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థలు తమ కార్యకలాపాలు వేగంగా విస్తరింపజేస్తున్నాయి.
వాయిదా చెల్లింపులు..
మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు ముందుగా తమ ఏజెంట్లను గ్రామాల్లోకి పంపి పేద మహిళలు, సంఘాల సభ్యులను కలుస్తున్నారు. వారం, 15 రోజుల వాయిదా చెల్లింపులతో రుణాల ఆశ చూపుతున్నారు. డ్వాక్రా గ్రూపుల్లో సకాలంలో చెల్లించని వారు మైక్రోసంస్థలను ఆశ్రయిస్తున్నారు. 10నుంచి 12మంది మహిళలను గ్రూపుగా ఏర్పాటు చేసి 15 రోజుల్లోనే రుణం అందిస్తున్నారు. ఒక్కో గ్రామంలో 20 నుంచి 30 గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు పొందినట్లుగా తెలుస్తుంది. కామారెడ్డి జిల్లాలో రామారెడ్డి, సదాశివనగర్ భిక్కనూరు, దోమకొండ, బీబీపేట మండలాల్లో ఈ తరహా రుణాలు ఎక్కువగా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈజీగా రుణం వస్తుండడంతో మహిళలు వీటికి ఆకర్షితులు అవుతున్నారు. తీరా ఆర్థిక ఇబ్బందులతో ఈఎంఐ చెల్లించకపోతే వేధింపులకు గురిచేస్తున్నారు. గ్రామాలలో మైక్రో ఫైనాన్స్ తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న సంబంధిత అధికారులు నిలువరించడంలో విఫలమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు చేసి కేసులు నమోదు చేసిన పోలీసులు మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఎందుకు నిలువరించడం లేదని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, మైక్రో ఫైనాన్స్ సంస్థలు నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు.
రామారెడ్డిలోని రమేష్ అనే వ్యక్తి ఇటీవల అవసరానికి మైక్రో ఫైనాన్స్ వారం గ్రూప్‌లో రూ.10వేలు అప్పు తీసుకున్నాడు. వారం వారం చెల్లింపుల్లో తేడా రావడంతో సదరు ఏజెంట్లు రాత్రి 10గంటల వరకు వేచి ఉండి వారం తాలూకా కిస్తీ పైసలు వసూలు చేసుకువెళ్లారు. రూ.పదివేలు తీసుకుంటే వడ్డీతో కలిపి రూ.17,000 వరకు మైక్రో ఫైనాన్స్ వారు వసూలు చేయడంతో అతడు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.
అవగాహన కల్పిస్తున్నాం..
డ్వాక్రా సంఘాల మహిళలు ఎవరూ కూడా మైక్రో ఫైనాన్స్ రుణాలు తీసుకోవడం లేదు. మైక్రో ఫైనాన్స్ సంస్థలపై, వారి ఆగడాలపై ప్రజలకు అవగా హన కల్పిస్తున్నాం. గ్రామాలలో ప్రజలు రుణాల కోసం మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించవద్దు.
– భూమాగౌడ్, సీసీ, డ్వాక్రా సంఘం, రామారెడ్డి
అధిక వడ్డీలు.. వేధింపులు


