విస్తారంగా శనగ..
● జిల్లాలో 15 వేల ఎకరాల్లో సాగు
● సింహభాగం బోధన్ డివిజన్‌లోనే..
బోధన్ రూరల్: జిల్లాలో రైతులు శనగ పంటను విస్తారంగా సాగు చేస్తున్నారు. యాసంగి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని సాగునీటి సౌలభ్యం ఉన్నవారు శనగ సాగుకే మొగ్గుచూపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల ఎకరాలకు పైగా శనగ పంట పండిస్తుండగా సింహభాగం బోధన్ డివిజన్ రైతులే సాగు చేస్తున్నారు. అత్యధికంగా బోధన్ మండలంలో 4,490 ఎకరాలు, రెంజల్‌లో 4,200 ఎకరాలు, సాలూరలో 2,918 ఎకరాలు, పోతంగల్ లో 2,570 ఎకరాల్లో శనగ పంట పండిస్తున్నారు.
మద్దతు ధర రూ.5,650
ప్రభుత్వం శనగ పంట క్వింటాలుకు రూ. 5,650 మద్దతు ధర ప్రకటించింది. పెట్టుబడి ఖర్చులు తక్కువ ఉండటం, మద్దతు ధర బాగుండటంతో రైతులు శనగ సాగు చేస్తున్నారు. అయితే, రెండు, మూడు సంవత్సరాల నుంచి శనగ పంటలో ఆశించిన దిగుబడి రాకపోవడంతో అనుకున్న లాభాలు గడించలేకపోయామని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది శనగ పంట కాస్త ఆశాజనకంగా ఉందని, తెగుళ్ల ప్రభావం కాస్త తక్కువగా ఉండటంతోపాటు పంట ఎదుగుదల బాగుందని రైతులు పేర్కొంటున్నారు. పంట కోత వరకు వాతావరణం అనుకూలించి, తెగుళ్ల ప్రభావం లేకపోతే ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడి రావొచ్చని చెబుతున్నారు.


